దుబాయి వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో వార్నర్‌సేన గెలిచింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సీఎస్కే బ్యాట్స్‌మెన్‌ను ఆది నుంచే అడ్డుకోవడం వల్ల సన్‌రైజర్స్ విజయం సాధించింది. సన్‌రైజర్స్ డెత్ ఓవర్ స్పెషలిస్టు నటరాజన్ 2 వికెట్లు సాధించగా.. భువనేశ్వర్, అబ్దుల్ సమద్ చెరో వికెట్ పడగొట్టారు. చివర్లో సీఎస్కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అర్ధశతకం చేసి నటరాజన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఛేదనలో ధోనీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులకే పరిమితమైంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ యువ బ్యాట్స్‌మన్ ప్రియమ్‌గార్గ్ (51; 26 బంతుల్లో 6x4, 1x4) రెచ్చిపోయి ఆడాడు. టోర్నీలో తొలి అర్ధశతకాన్ని నమోదు చేసి ఆకట్టుకున్నాడు. అభిషేక్ శర్మ (31; 24 బంతుల్లో 4x4, 1x6), డేవిడ్ వార్నర్(28; 29 బంతుల్లో 3x4), మనీష్ పాండే (29; 21 బంతుల్లో 5x4) తమవంతు కృషి చేశారు. చెన్నై ముందు పోరాడే స్కోర్ నిర్దేశించారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 2, శార్దుల్ ఠాకుర్ 1, పీయూష్ చావ్లా 1 వికెట్ తీశారు.