మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరకుండానే వెనుదిరిగింది. గత 13 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడం వల్ల చెన్నై ఇంటిముఖం పట్టింది.
ఆదివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై గెలిచి ప్లేఆఫ్స్ అవకాశాల్ని కొద్దిగా మెరుగు పర్చుకున్నట్లు కనిపించింది సీఎస్కే. కానీ తర్వాత మ్యాచ్‌లో ముంబయిపై రాజస్థాన్ గెలిచి చెన్నై ఆశలపై నీళ్లు చల్లింది.
బెంగళూరుపై గెలిచిన చెన్నైకి ప్రస్తుతం 8 పాయింట్లు ఉన్నాయి. ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ రెండింటిలో గెలిచినా సీఎస్కే 12 పాయింట్లకు మాత్రమే చేరుకుంటుంది. ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లడానికి ఈ పాయింట్లు సరిపోవు.
పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తర్వాత 12 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది. అనంతరం 10 పాయింట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ కొనసాగుతున్నాయి.