హైదరాబాద్‌తో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ ఆడాల్సిందని, చివరి నిమిషంలో అతడు దూరమయ్యాడని ఆ జట్టు కోచ్ అనిల్ కుంబ్లే చెప్పాడు.
ఈ పోరులో తొలుత హైదరాబాద్ 201 పరుగుల భారీ స్కోరు చేయగా, ఛేదనలో 132 పరుగులకే ఆలౌటైంది పంజాబ్. దీంతో ఈ లీగ్‌లో ఐదో ఓటమి చవిచూసి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్ అభిమానులు తుది జట్టు ఎంపికను తప్పుబడుతున్నారు. తరచూ విఫలమవుతున్న మాక్స్‌వెల్‌ను తీసి క్రిస్‌గేల్‌ను ఆడించాలని కోరుతున్నారు.
టోర్నీ నిర్వాహకులు గేల్‌ను ఎందుకు ఆడించడం లేదని పంజాబ్ కోచ్ కుంబ్లేను నిన్న మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రశ్నించారు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గేల్ తుది జట్టులో ఉన్నాడని, కానీ ఫుడ్ పాయిజన్ కారణంగా కడుపునొప్పితో బాధపడుతుండటం వల్ల చివరి క్షణాల్లో తప్పుకున్నాడని స్పష్టం చేశాడు.
2009 నుంచీ ఈ మెగా టీ20 లీగ్ ఆడుతున్న గేల్.. ఇప్పటివరకు 125 మ్యాచ్‌లు ఆడి, 4,484 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 175 నాటౌట్. ఈ టోర్నీలో 326 సిక్సులు బాది అందరికన్నా ముందున్నాడు. తర్వాత బెంగళూరు బ్యాట్స్‌మన్ డివిలియర్స్ 219 సిక్సులతో ఉన్నాడు.