"ఆ బ్యాట్స్‌మన్ మైదానంలో ఉంటే ఒత్తిడికి గురవ్వడు. ప్రత్యర్థిని ఒత్తిడికి లోనయ్యేలా చేస్తాడు".... ఈ మాటలన్నది చెన్నై బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా. చెప్పింది కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి.
బుధవారం దిల్లీతో మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో గెలిచింది సీఎస్కే. అనంతరం మాట్లాడిన రైనా.. ధోని గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
"ధోని కెప్టెన్‌గా మ్యాచ్‌లో లేకపోతే సమస్య కాదు. బ్యాట్స్‌మన్‌గా లేకపోవడం మాత్రం పెద్ద లోటు. ఇటీవల హైదరాబాద్, ముంబయితో మ్యాచ్‌ల్లో అదే జరిగింది. అతడు క్రీజులోకి వస్తే ప్రత్యర్థికే ఒత్తిడంతా. ధోని లేనప్పుడు ఈ విషయం మాకు అర్ధమైంది. గత కొన్నేళ్లుగా బ్యాట్స్‌మన్‌గా, మార్గనిర్దేశకుడిగా రాణిస్తున్నాడు. ధోని మరింత కాలం క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నా" -సురేశ్ రైనా, చెన్నై సూపర్ కింగ్స్
బుధవారం దిల్లీతో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో రెండు అద్భుతమైన స్టంపింగ్స్ చేసి ఆకట్టుకున్నాడు ధోని. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కీపర్‌గానూ మహీ రాణిస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు రైనా. ఈ మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలిచిన ధోని.. 22 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు 179 స్కోరు చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. రైనా 59 పరుగులు చేశాడు.