ధోని, జడేజాకు ఆరోగ్యం బాగా లేదని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పాడు. ఇద్దరూ వైరల్ జ్వరం బారిన పడ్డారని తెలిపాడు. ప్రపంచకప్ దగ్గర పడుతున్న తరుణంలో భారత అభిమానులకు ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్‌కు మహీ దూరమైన విషయం తెలిసిందే. తర్వాత మ్యాచ్‌లకు వీరు అందుబాటులో ఉంటారన్న విషయంపై స్పష్టత లేదు.
"ధోని, జడేజా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. మిగతా జట్లలోని ఆటగాళ్లూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఐదు రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబయి చక్కటి ప్రదర్శన చేసింది. తర్వాత మ్యాచ్‌కు మాకు నాలుగు రోజుల బ్రేక్ ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మిడిల్ ఆర్డర్లో ధోని స్థానాన్ని పూడ్చలేనప్పటికీ.. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం" - ఫ్లెమింగ్, చెన్నై కోచ్
ఈ సీజన్లో ధోని లేకుండా ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఇంతకు ముందు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు తాజాగా ముంబయి చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో ఏడు ఇన్నింగ్స్ ఆడిన ధోని 314 పరుగులు చేశాడు. 100కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ వేదికగా మే 30న ప్రపంచకప్ ప్రారంభంకానుంది. ఈ సమయంలో వరల్డ్‌కప్ జట్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు అనారోగ్యం పాలవడం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకుముందు బుమ్రాకు భుజం గాయమైంది. అయితే ఈ పేసర్ వెంటనే కోలుకుని మళ్లీ ఐపీఎల్లో సత్తాచాటుతున్నాడు.