శ్రీలంకతో జరుగుతోన్న చివరిదైన మూడో టీ20లో టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్ దారుణ ప్రదర్శన చేశారు. కరోనా కారణంగా దాదాపు ఎనిమిది మంది ఆటగాళ్లు దూరమవడం వల్ల సగం మంది కొత్త క్రికెటర్లతో బరిలో దిగిన ధావన్సేన ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి కేవలం 81 పరుగులే చేసింది.
ఆద్యంతం తడబాటే..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే కెప్టెన్ ధావన్.. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టీ20లో టీమ్ఇండియా సారథి గోల్డెన్ డక్(తొలిబంతికే ఔట్ అవ్వడం)గా వెనుదిరగడం ఇదే తొలిసారి. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్(9) కూడా ఎల్బీడబ్ల్యూగానే వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన శాంసన్(0).. ఆడిన మూడు బంతులూ తడబడ్డాడు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న శాంసన్ కూడా ఎల్బీడబ్ల్యూగానే ఔట్ అయ్యాడు. అప్పటివరకు క్రీజులో ఉండి నెమ్మదిగా ఆడిన గైక్వాడ్(14) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇక ఆ తర్వాత వచ్చిన నితీశ్ రాణా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం ఆరు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. ఇలా 36పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది టీమ్ఇండియా.
టాప్ ఆర్డ్‌ర్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు చేతులెత్తేయగా.. క్రీజులోకి వచ్చిన భువనేశ్వర్(16), కుల్దీప్ యాదవ్‌లు కాస్త పరుగులు రాబట్టడం వల్ల స్కోరు ఆ మాత్రమైనా వెళ్లిందని చెప్పాలి. ముఖ్యంగా 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన కుల్దీప్ యాదవ్.. ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ కావడం గమనార్హం. భువనేశ్వర్ ఔట్ అయిన తర్వాత వచ్చిన రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి పేలవ ప్రదర్శనే చేశారు. ఒకానొక సందర్భంలో జట్టు ఆలౌట్ అవుతుందని అందరు భావించారు. కానీ కుల్దీప్ ఆడటం వల్ల అది జరగలేదు.
లంక బౌలర్లు సమిష్టిగా రాణించగా.. వారి ముందు టీమ్ఇండియా యువ బ్యాట్స్‌మెన్ కనీసం నిలువలేకపోయారు. ముఖ్యంగా వానిందు హసరంగ(4 వికెట్లు) తన పేస్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. అతడికి తోడుగా ఆర్ మెండిస్(1 వికెట్), సారథి శనక(2వికెట్లు) నిలవడం వల్ల టీమ్ఇండియా కోలుకోలేకపోయింది.
ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం 4 ఫోర్లే నమోదయ్యాయి. ఒక్కటంటే ఒక్క 6కు లేదు.
నిర్ణయాత్మక టీ20 కారణంగా.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ట్రోఫీని కైవశం చేసుకోనుంది.
శ్రీలంక టూర్లో ధావన్ సేనకు ఇదే చివరి మ్యాచ్. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను దక్కించుకుంది టీమ్ఇండియా.
ఇదీ జరిగింది:- 'అలా చేస్తే బుమ్రా పని ఖతం.. జాగ్రత్త పడాల్సిందే'