Indian Street Premier League Date : ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్- ఐఎస్పీఎల్ వచ్చే ఏడాది మార్చి 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్లు సెలక్షన్ కమిటీ హెడ్ జతిన్ పరంజమే తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో నిర్వహించే ఈ టోర్నీలో ఎంపికి ప్రక్రియ 2024 జనవరి చివరి వారంలో జరుగుతుందని తెలిపారు. అందులో దాదాపు 350 మంది క్రికెటర్లను షార్ట్‌లిస్ట్ చేస్తామని చెప్పారు. అన్ని వయసుల వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమ టెన్నిస్ బాల్ క్రికెట్ నైపుణ్యాలను వీడియోల ద్వారా ప్రదర్శించవచ్చని తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదారాబాద్‌లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ISPL T10 : ఈ ఐఎస్‌పీఎల్‌ను దేశవాళీ, ఇంటర్నేషనల్ క్రికెట్‌కు భిన్నంగా గ్రేస్ బాల్‌కు బదులు టెన్నిస్ బాల్‌తో నిర్వహిస్తున్నామని జతిన్ తెలిపారు. కానీ ఫార్మట్ మొత్తం ఐపీఎల్ మాదిరిగానే ఉంటుందని చెప్పారు. ఈ టోర్నీలో రాణించిన వారికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అవకాశాలు లభిస్తాయన్నారు. మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే నేతృత్వంలో క్రీడాకారుల సెలెక్షన్ జరుగుతుందని తెలిపారు. వేలం ద్వారా ఒక్కో ప్లేయర్‌కు రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల ధర పలుకుతుందని వెల్లడించారు.
టీ10 ఫార్మాట్లో జరగనున్న ఈ టోర్నీకి టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మెంటార్‌గా ఇప్పటికే నియమితులయ్యారు. జతిన్ పరంజమేతో పాటు ప్రవీణ్ ఆమ్రే కూడా సెలక్షన్ కమిటీ హెడ్‌గా ఉన్నారు. బీసీసీఐ కోశాధికారి ఆశిశ్ షెలార్, ముంబయి క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు ఆమోల్ కాలే కోర్ కమిటీ మెంబర్లుగా ఉన్నారు.
Indian Street Premier League Registration : ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్ లు క్రికెట్ మైదానంలో జరుగుతాయి. ఐఎస్పీఎల్ తొలి ఎడిషన్‌లో ఆరు మహానగరాలు హైదరాబాద్, ముంబయి, కోల్‌కతా, శ్రీనగర్, బెంగళూరు, చెన్నై నుంచి ఆరు టీమ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ టోర్నీ దేశంలో తొలి టీ10 టెన్నిస్ బాల్ లీగ్ కావడం గమనార్హం. ఆసక్తి కలిగిన ప్లేయర్లు ఐఎస్పీఎల్ అధికారికి వెబ్సైట్ www.ispl-t10.com వెళ్లి రూ.999 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి వారి పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కీపర్ ప్యాడ్‌లో చిక్కుకున్న బంతి- డేంజర్‌గా మారిన పిచ్- క్రికెట్‌లో విచిత్ర సంఘటనలు