Ravichandran Ashwin World Cup 2023 : ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో భారత్ కప్ కొడుతుందా? అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమ్ఇండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చి అభిమానులను ఆకట్టుకున్నాడు.
'వన్డే వరల్డ్‌కప్ 2023 మెగా ఈవెంట్లో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ నిరీక్షణపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగడం మామూలే. అసలు ఇలాంటి ప్రశ్నే హాస్యాస్పదం. భారత్ పటిష్ఠమైన జట్టు. కొన్ని అంశాలు మినహా ఈసారి భారత్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి." అంటూ భారత్ తన ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు ఎండ్ కార్డు వేస్తుందా..? అని అభిమానులు అడిగిన ప్రశ్నకు అశ్విన్ ఈ విధంగా బదులిచ్చాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ విజయం సాధించడంలో అశ్విన్ కీలక పాత్ర పోషించారు. అటువంటి ఆసక్తికరమైన మ్యాచ్‌ను మళ్లీ వన్డే ప్రపంచ కప్‌లోనూ చూడబోతున్నామని అశ్విన్ చెప్పాడు.
"భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. వీటిని అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి మ్యాచ్‌లను త్వరలోనే చూడబోతున్నాం. పాక్‌కు సీమ్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. టీమ్‌ఇండియాకు కూడా బుమ్రా, ప్రసిధ్ రూపంలో గొప్ప పేసర్లు ఉన్నారు. వారిద్దరూ ఫిట్‌నెస్ సాధిస్తారని అనుకుంటున్నాం."
- రవిచంద్రన్ అశ్వన్, క్రికెటర్
కనీసం ఈసారైనా..?
ఐసీసీ ట్రోఫీని భారత్ చివరిసారిగా 2013లో గెలుచుకుంది. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక ఆ తర్వాత ఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచకప్‌లు, నాలుగు టీ20 ప్రపంచకప్‌లు, ఒక ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. సెమీస్, ఫైనల్స్ వరకు చేరినప్పటికీ విజేతగా నిలవలేకపోయింది. అలాగే రెండుసార్లు టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లి మరీ ఓటమి చవిచూసింది. దీంతో భారత్ ఐసీసీ ట్రోఫీని మళ్లీ ఎప్పుడు గెలుస్తుందా..? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కనీసం ఈసారైనా పదేళ్ల నిరీక్షణకు టీమ్ఇండియా ఆటగాళ్లు తెర దించుతారా లేదా అనేది వేచి చూడాలి.