West Indies vs India Match : మరో రెండు రోజుల్లో భారత్, వెస్టిండీస్ మెగా పోరుకు తెరలేవనుంది. ఈ రెండు జట్లు ఈనెల 12 నుంచి రెండు టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20లు ఆడనున్నాయి. ఇందులో భాగంగానే ఆ దేశ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు.. తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రాక్టీస్ మ్యాచులను కూడా ఆడుతున్నారు. అయితే ఇప్పటికే ఇరు జట్లకు సంబంధించి తుది జట్టులను కూడా ప్రకటించాయి ఆయా క్రికెట్ బోర్డులు.
ఆ ముగ్గురు..!
West Indies vs India Test : జులై 12 నుంచి 17 వరకు జరిగే ఈ టోర్నీలోని రెండు టెస్టుల సిరీస్‌ను నెగ్గేందుకు భారత్‌కే ఎక్కువ విజయవకాశాలు ఉన్నప్పటికీ.. కరీబియన్ల జట్టులో ఉన్న ఆ ముగ్గురు కీలక ఆటగాళ్లను మాత్రం తక్కువ అంచనా వేయొద్దని సూచిస్తున్నారు పలువురు మాజీలు. అలా చేసి మెరుగైన ఆటతీరును ప్రదర్శించకపోతే ఈ సిరీస్‌ను కూడా చేజేతులా కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంతకీ సిరీస్‌పై ప్రభావం చూపే ఆ ముగ్గురు విండీస్ ప్లేయర్స్ ఎవరంటే.. క్రెయిగ్ బ్రాత్‌వైట్, టాగెనరైన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్.
క్రెయిగ్ బ్రాత్‌వైట్!
Kraigg Braithwaite : టెస్టు పార్మాట్లోని ఇన్నింగ్స్‌కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగింపు పలకాలని భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు. కానీ విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ మాత్రం ఇందుకు కాస్త భిన్నం. 1990వ దశకంలో ఆడే ఆటగాళ్లలా చాలా ఓపికగా క్రీజులో ఉంటూ ఇన్నింగ్స్‌ను ట్రెడిషనల్ పద్ధతిలో కొనసాగిస్తుంటాడు. ఎన్ని రోజులైనా బ్యాటింగ్ చేసే సహనం కేవలం బ్రాత్వైట్కే సొంతం అని అంటుంటారు. ఇలా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టడంలో ఇతడు ఆరితేరాడు. అయితే ఈ టెస్టు సిరీస్‌లో క్రెయిగ్ బ్రాత్‌వైట్‌ను త్వరగా అవుట్ చేయలేకపోతే మాత్రం అనుభవం లేని భారత బౌలింగ్‌ను తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
టాగెనరైన్ చందర్‌పాల్!
Tagenarine Chanderpaul : తండ్రి శివనారాయన్ చందర్పాల్లాగే టాగెనరైన్ చందర్‌పాల్ కూడా అద్భుతమైన బ్యాటర్. ఇతడు కూడా బ్రాత్‌వైట్ లాగానే ఓపిక కలిగిన ప్లేయర్. కాకపోతే బ్రాత్‌వైట్ కన్నా కొంచెం వేగంగా ఆడతాడు. ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు ఇష్టపడతాడు. బౌలర్లు వేసే మిడిల్ ఓవర్లో ఇతడ్ని కట్టడి చేయలేకపోతే మాత్రం భారత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కెరీర్ ఎంట్రీలోనే కంగారూలను కంగారు పెట్టించిన ఈ యువ ప్లేయర్ ఇటీవలి కాలంలో కెప్టెన్ బ్రాత్‌వైట్‌తో కలిసి విండీస్‌కు అద్భుతమైన ఆరంభాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు.
రకీం కార్న్‌వాల్!
Rahkeem Cornwall : బంతిని అద్భుతంగా స్పిన్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్‌ను ఇబ్బంది పెట్టడం స్పిన్నర్ రకీం కార్న్‌వాల్ స్పెషాల్టీ. అభిమానులు ముద్దుగా ఇతడిని జింబో అని పిలుస్తారు. కార్న్‌వాల్ కాస్త ఎత్తుగా ఉండటం కూడా విండీస్ జట్టుకు ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎత్తు ఎక్కువగా ఉంటే మంచి బౌన్స్ వేయగలడు బౌలర్. ఇందులో కార్న్‌వాల్ ఆరితేరాడు. కేవలం బాల్తోనే కాదు బ్యాట్‌తోనూ కూడా మాయ చేస్తాడు ఈ జింబో. అయితే ఇటీవల టీమ్ఇండియా పాల్గొన్న కొన్ని మ్యాచులు గమనిస్తే.. బ్యాటర్లు ఎడం చేతి వాటం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో బౌలింగ్ వేసే సమయంలో బింజోకు ఛాన్స్ వస్తే మాత్రం మన బ్యాటర్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.