India Vs South Africa 3rd T20 : పొట్టి సిరీస్‌లో ఆఖరి పోరుకు టీమ్ఇండియా రెడీగా ఉంది. సిరీస్‌ను సమం చేయాలనుకుని మైదానంలోకి దిగాలనుకుంటున్న భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ క్రమంలో అందరి దృష్టీ.. గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే వాళ్లు వేగం పుంజుకోవడం చాలా అవసరం. కానీ సఫారీలను కంట్రోల్ చేయడం వారికి పెద్ద సవాలుగా మారనుంది.
ఇటీవలే జరిగిన రెండో టీ20లో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, ముకేశ్ యాదవ్ తమ ఫామ్‌ను కోల్పోయారు. 15.50, 11.33 ఎకానమీతో ఆ ఇద్దరూ పరుగులిచ్చారు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల పేసర్ దీపక్ చాహర్ అందుబాటులో లేకపోవడం కూడా టీమ్‌ఇండియా బౌలింగ్ లైనప్‌కు కష్టాలను పెంచింది. మరోవైపు బుమ్రా వంటి సీనియర్ గైర్హాజరీలో అర్ష్‌దీప్, ముకేశ్‌లపైనే విశ్వాసం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ఈ సారి నిరాశ తప్పలేదు. ఇక రిజర్వ్ బెంచ్ ఇప్పటివరకు వారి విశ్వాసాన్ని నిలబెట్టలేకపోయింది.
నిజానికి సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ను 4-1తో గెలవడం వల్ల మన జట్టులోని కొన్ని లోపాలు మరుగున పడ్డాయి. అయితే అయిదో టీ20లో ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతే తప్ప సిరీస్ మొత్తం అతడు ఆకట్టుకోలేకపోయాడు. ఇక నాలుగు మ్యాచ్‌ల్లో ఓవర్‌కు 10.68 పరుగుల చొప్పున ఇచ్చిన అర్షదీప్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.
మరోవైపు ముకేశ్ కూడా అంతే. ఆసీస్‌పై ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓవర్‌కు 9 పరుగులపైనే సమర్పించుకున్నాడు. అదే తడబాటును వీళ్లిద్దరు దక్షిణాఫ్రికాలోనూ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లు ఆఖరి మ్యాచ్‌లోనైనా గాడినపడి జట్టు సిరీస్ కోల్పోకుండా చూసుకోవాల్సిన అవసరముంది. ఇక టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియాకు నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఉన్న నేపథ్యంలో సెలక్టర్ల దృష్టిలో ఉండాలంటే ఈ ఇద్దరూ మెరుగైన ఫామ్‌ను చూపించాల్సి ఉంటుంది.
ఇక రెండో టీ20లో విఫలమైన వైస్ కెప్టెన్ రవీంద్ర జడేజా ఈసారైనా సత్తా చాటాలని జట్టు కోరుకుంటోంది. అయితే రింకు సింగ్ ఆకట్టుకునే ప్రదర్శనను కొనసాగిస్తుండటం జట్టుకు గొప్ప సానుకూలాంశంగా మారింది. గత మ్యాచ్‌లో రింకూ టాప్ స్కోరర్‌గా నిలవగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే.
మరోవైపు డకౌటైన ఓపెనర్లు యశస్వి జైస్వాల్,శుభ్‌మన్ గిల్ బలంగా పుంజుకుని మెరుపు ఆరంభాన్ని ఇవ్వాలంటూ జట్టు ఆశిస్తోంది. ఒక వేళ రుతురాజ్ అనారోగ్యం నుంచి కోలుకుంటే గిల్ స్థానంలో అతడు టీమ్‌లోకి వస్తాడు. కుల్‌దీప్ స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆతిథ్య సౌతాఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. పేసర్లు జాన్సన్, కొయెట్జీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవడం కోసం ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడేందుకు ఈ ఇద్దరూ జట్టును వీడారు.
పిచ్ ఎలా ఉందంటే..
India Vs South Africa 3rd T20 Pitch : మ్యాచ్ వేదికైన జొహానెస్‌బర్గ్‌లో చినుకులు పడే అవకాశమున్నప్పటికీ అవేం మ్యాచ్‌కు పెద్దగా అంతరాయం కలిగించకపోవచ్చు. దీంతో మ్యాచ్ పూర్తిగా జరగొచ్చు. ఇక్కడ బంతి చాలా వేగంగా బౌండరీకి చేరుతుంది. పేసర్లకు కూడా మంచి సహకారం లభించవచ్చు. ఈ వేదికలో అన్ని ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా మెరుగైన ప్రదర్శనే చేసింది. టీ20ల్లో భారత జట్టుకు 3-1తో మంచి రికార్డే ఉంది.
ఎవరూ టచ్ చేయనంత దూరంలో సూర్య- 2024 వరల్డ్‌కప్ దాకా పొజిషన్ సేఫ్!- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ రిలీజ్