దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో సౌతాఫ్రికాపై టీమ్‌ఇండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్ (57; 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (54; 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 131 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్లాసెన్ (29) టాప్ స్కోరర్. హెన్రిక్స్ (23), ప్రిటోరియస్ (20), బవుమా (8), డసెన్ (1), డేవిడ్ మిల్లర్ (3), కేశవ్ మహరాజ్ (11), రబాడ (9), నార్జ్ (0), షంసి (0) పరుగులు చేశారు. పార్నెల్ ( 22)నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ 4, యుజువేంద్ర చాహల్ 3 వికెట్లతో మెరవగా..అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
తొలుత టీమ్‌ఇండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. మొదట్లో ఇషాన్ కిషన్ నెమ్మదిగా ఆడినా.. రుతురాజ్ దూకుడు ప్రదర్శించాడు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఓ ఫోర్, సిక్స్ బాదగా.. నార్జ్ వేసిన ఐదో ఓవర్‌లో వరుసగా ఐదు ఫోర్లు బాది తన విశ్వరూపం చూపించాడు. ఈ క్రమంలోనే షంసి వేసిన తొమ్మిదో ఓవర్‌లో టీ20ల్లో తొలి అర్ధశతకం పూర్తి చేసుకున్న రుతురాజ్.. కేశవ్ మహరాజ్ వేసిన తర్వాతి ఓవర్‌లో ఔటయ్యాడు. షంసి వేసిన 13 ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్, ప్రిటోరియస్ వేసిన 14వ ఓవర్‌లో ఇషాన్ కిషన్ ఔటయ్యారు. దీంతో స్కోరు వేగం నెమ్మదించింది. చివర్లో హార్దిక్ కాస్త దూకుడుగా ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రిటోరియస్ 2, రబాడ, షంసి, కేశవ్ మహరాజ్ ఒక్కో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: బీసీసీఐకి జాక్‌పాట్.. రూ.48,390 కోట్లకు ఐపీఎల్ మీడియా రైట్స్