శ్రీలంకపై మూడు వన్డేల సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం సిద్ధమైంది. ఇరుజట్ల మధ్య తొలివన్డే హైదరాబాద్ వేదికగా జరగనుంది. సొంతగడ్డపై కివీస్‌ను కూడా చిత్తు చేయాలని భారత జట్టు కోరుకుంటోంది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో వేగవంతమైన డబుల్ సెంచరీతో కదంతొక్కినా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు తుది జట్టులో చోటు దక్కని ఇషాన్ కిషన్‌కు ఈసారి బరిలోకి దిగే అవకాశం దక్కనుంది.
వ్యక్తిగత కారణాల వల్ల కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరంకావడంతో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ తుదిజట్టులోకి రానున్నాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమల్ గిల్ ఉండటంతో మిడిల్ ఆర్డర్‌లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కెరీర్‌లో ఆడిన 10 వన్డేల్లో ఇషాన్ కిషన్ మూడుసార్లు మిడిల్ ఆర్డర్‌లోనే బరిలోకి దిగాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక శతకం, ఒక అర్థశతకంతో శుభమన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి గిల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. చివరి 4 వన్డేల్లో 3 శతకాలు నమోదు చేసి విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉండగా.. అనారోగ్యంతో శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో మిడిల్‌ఆర్డర్‌లో స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్‌కు పోటీ లేకుండా పోయింది. టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో కూడా చోటు సుస్థిరం చేసుకునేందుకు ఈ సిరీస్ మంచి అవకాశంగా మారింది. ఆల్‌రౌండర్ అక్షర్‌పటేల్‌కు విశ్రాంతినివ్వడంతో అతని స్థానంలో షహ్‌బాజ్ లేదా వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానం కోసం కులదీప్, చాహల్ పోటీపడుతున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో సత్తా చాటిన కులదీప్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పేస్ బౌలింగ్ విభాగంలో అద్భుత ఫామ్‌లో ఉన్న మహమ్మద్ సిరాజ్‌తో పాటు మహమ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్ భారత్‌కు అండగా ఉన్నారు. హర్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ బాధ్యతలు నెరవేర్చనున్నాడు.
మరోవైపు స్టార్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీ లేకుండానే భారత్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు సిద్ధమైంది. లాథమ్ కివీస్‌కు సారథ్యం వహించనున్నాడు. ఓపెనర్ ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ వంటి ఆటగాళ్లపై న్యూజిలాండ్ భారీ ఆశలు పెట్టుకుంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు మ్యాచ్ ప్రారంభంకానుంది.