టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ఎదుర్కొవడం చాలా కష్టమని కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (Martin Guptill News) అన్నాడు. అతడు చాలా కచ్చితత్వంతో బంతులేస్తాడని, వాటిని అంచనా వేయడం కష్టమని పేర్కొన్నాడు. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ (India vs New Zealand) ముగిసిన అనంతరం గప్తిల్ మాట్లాడాడు.
"అశ్విన్ చాలా తెలివైన బౌలర్. కచ్చితత్వంతో సరైన లెంగ్త్‌లో బంతులేస్తాడు. పేస్‌లోనూ వైవిధ్యం చూపించగలడు. అతడి కెరీర్లో ఎప్పుడూ చెత్త బంతులేయలేదు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం"
- మార్టిన్ గప్తిల్, న్యూజిలాండ్ బ్యాటర్
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అశ్విన్ (Ravichandran Ashwin News) రెండు వికెట్లు తీశాడు. తొలి మ్యాచ్‌లో కివీస్ ఓటమిపై గప్తిల్ స్పందిస్తూ.. "మేం బాగానే ఆడాం. అదనంగా మరో 10 పరుగులు చేయాల్సింది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా కొన్నిసార్లు బాగా ఆడలేకపోవచ్చు. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే మరో సిరీస్ ఉండటం వల్ల కొంచెం ఒత్తిడికి గురయ్యాం. ఆరంభంలో డెరిల్ మిచెల్ ఔట్ కావడం కూడా మాపై ప్రభావం చూపింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మార్క్ చాప్‌మన్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పడం వల్ల పోటీ ఇచ్చే స్కోరు చేయగలిగాం. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల మా బ్యాటర్లు ధాటిగా ఆడలేకపోయారు. మరో 10 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో" అని గప్తిల్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో గప్తిల్ (70), మార్క్ చాప్‌మన్ (63) అర్ధ శతకాలతో రాణించారు.
ఇదీ చూడండి: IND vs NZ: 'కోహ్లీ తిరిగొచ్చినా.. మూడో స్థానంలో అతడే ఆడాలి'