India vs New Zealand ODI Series : న్యూజిలాండ్-ఇండియా రెండో వన్డే వర్షం కారణంగా రద్దయింది. కాగా ఆ మ్యాచ్‌లో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోకపోవడం వల్ల టీమ్ఇండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిలకడగా ఆడుతున్న ప్లేయర్లను తీసేసి.. బాగా ఆడని ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నారంటూ నెట్టింట్లో చర్చ నడుస్తోంది. దీంతో తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ స్పందించాడు.
జట్టు కూర్పులో భాగంగానే సంజూ శాంసన్‌ను పక్కన పెట్టామని చెప్పాడు. ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. కాగా మొదటి వన్డేలో ఐదుగురు బౌలర్లతోనే టీమ్ ఇండియా బరిలోకి దిగి.. ఓటమి పాలైంది. 'జట్టుకు ఆరో బౌలర్ కావాలనుకున్నాం. దాని కారణంగానే సంజూ శాంసన్‌కు బదులు దీపక్ హుడాను తీసుకున్నాం. బంతిని స్వింగ్ చేయగలడనే.. దీపక్ చాహర్‌ను ఎంచుకున్నాం'.
'కొంతమంది ఆటగాళ్లు విశ్రాంతిలో ఉన్నా.. ఈ టీమ్ బలంగా ఉంది. యువ జట్టుకు నాయకత్వం వహించడం ఉత్సాహంగా ఉంది. నేను కూడా కుర్రాడిలా మారానని అనిపిస్తోంది. శుభ్‌మన్ బ్యాటింగ్, ఉమ్రాన్ బౌలింగ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. చాలా అద్భుతంగా ఆడుతున్నారు. మూడో వన్డే జరిగే క్రైస్ట్ చర్చ్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తామని ఆశిస్తున్నా. ఈ మ్యాచ్ గెలిచి మా ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటామనే నమ్మకంతో ఉన్నాను' అని శిఖర్ ధావన్ పేర్కొన్నాడు.
ఫామ్‌లో ఉన్నా తీసేశారు..
సంజూ శాంసన్ మొదటి మ్యాచ్‌లో బాగానే ఆడాడు. 36 పరుగులు చేసిన సంజూ.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో కూడా సంజూ శాంసన్ రాణించాడు. అయినా అతడికి టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు. పైగా రెండో వన్డేలో అతడి స్థానంలో దీపక్ హుడాను జట్టులోకి తీసుకున్నారు. ఇక శార్దూల్ ఠాకూర్‌పై కూడా వేటు పడింది. అతడి ప్లేస్‌లో దీపక్ చాహర్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి : 'భారత్ చాలా పవర్ఫుల్.. మాపై ఎవరూ అధికారం చూపించలేరు'.. రమీజ్‌కు కేంద్రమంత్రి కౌంటర్
'నువ్వయ్యా అసలు సిసలైన అభిమానివి.. ఒక్క గోల్‌కు ప్లేట్ ఫిరాయించావుగా!'