India vs New Zealand T20 2022: రెండూ టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఓటమితో నిరాశ చెందిన జట్లే. రెండు జట్లకూ ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. కుర్రాళ్లతో కూడిన టీమ్‌ఇండియా ఆదివారం జరిగే రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ వేదిక మారిందే తప్ప పరిస్థితుల్లో మార్పులైతే లేవు. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు మెండు.
సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ జోరు కొనసాగిస్తాడనే నమ్మకంతో భారత్ ఉంది. తుది జట్టులో స్థానం కోసం దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్ మధ్య పోటీ ఉంది. ప్రపంచకప్‌లో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయిన వికెట్‌కీపర్ బ్యాటర్ పంత్ ఎలా రాణిస్తాడో చూడాలి. పొట్టి ఫార్మాట్ భవిష్యత్తు కెప్టెన్‌గా నియమితుడవుతాడని అంతా భావిస్తున్న హార్దిక్.. తాత్కాలిక సారథిగా ఈ సిరీస్‌లో జట్టును ఎలా నడిపిస్తాడన్నది కూడా ఆసక్తికరం.బౌలింగ్‌లో అందరి కళ్లూ భువనేశ్వర్‌పైనే ఉన్నాయి.
ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం అతడికి చాలా అవసరం. హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ అతడితో కలిసి పేస్ భారాన్ని పంచుకుంటారు. ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాని చాహల్.. ఈసారి స్పిన్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. వాషింగ్టన్ సుందర్ రెండో స్పిన్నర్. మరోవైపు సొంతగడ్డపై సత్తా చాటాలనే పట్టుదలతో కివీస్ ఉంది. టాప్‌లో అలెన్, మిడిల్‌లో ఫిలిప్స్ ఆ జట్టుకు గొప్ప బలం.
ఇటీవల ఫామ్‌లో లేని కెప్టెన్ విలియమ్సన్ జోరందుకోవాలని కివీస్ కోరుకుంటోంది. సౌథీ, ఫెర్గూసన్, సోధి, శాంట్నర్‌లతో ఆ జట్టు బౌలింగ్ బాగానే ఉంది. రెండో టీ20 వేదికలో పూర్తయిన ఏడు తొలి ఇన్నింగ్స్‌ల్లో సగటు స్కోరు 199. పేసర్ల కన్నా స్పిన్నర్లకు ఇక్కడ కాస్త మెరుగైన రికార్డు ఉంది.
ఇదీ చదవండి:
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఏబీ డివిలియర్స్ కమ్ బ్యాక్
కివీస్ సంప్రదాయాలతో టీమ్ ఇండియాకు ఘన స్వాగతం క్రికెటర్ లుక్స్ హైలెట్