India Tour Of West Indies 2023 : టెస్టుల్లో టీమ్ఇండియాకు.. విండీస్‌పై మంచి రికార్డే ఉంది. గత కొన్నేళ్లుగా భారత్, వెస్టిండీస్‌పై దండయాత్ర చేసిందనే చెప్పవచ్చు. ఇరు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు టెస్టు సిరీస్‌ల్లోనూ.. టీమ్ఇండియాదే పైచేయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇప్పుడున్న టీమ్ఇండియా జట్టులోని జూనియర్ ప్లేయర్లు.. విండీస్ పిచ్‌లపై సవాలును అధిగమిస్తారా అన్న ప్రశ్న అందరి మదిలో తలెత్తుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రహానే, అశ్విన్, జడేజా మినహ జట్టులో ఉన్న వారందరికి పెద్దగా అంతర్జాతీయ టెస్టు అనుభవం లేదనే చెప్పాలి. అయితే మరోవైపు ప్రత్యర్థి .. వెస్టిండీస్‌కు వచ్చిన ప్రతీ జట్టుకు గట్టి పోటీనిస్తూ వస్తోంది. కరీబియన్ జట్టు చివరగా సొంతగడ్డపై ఆడిన ఐదు సిరీస్‌ల్లో కేవలం ఒకటే ఓడింది.
ఇరు జట్ల పేస్ బౌలింగ్..
- టెస్టుల్లో 2018 నుంచి విండీస్ బౌలింగ్ సగటు అన్ని జట్ల కంటే మెరుగ్గా 25.70గా ఉంది. వెస్టిండీస్ తర్వాత సౌత్ఆఫ్రిక 25.71 తో ఉండగా.. భారత్ 27.35తో మూడో స్థానంలో ఉంది.
- కరీబియన్ జట్టు కీమర్ రోచ్, జేసన్ హోల్డర్, గాబ్రిల్, అల్జారీ జోసెఫ్‌లతో పేస్ దళం పటిష్ఠంగా ఉంది. కరీబియన్ జట్టుతో పోలిస్తే.. టీమ్ఇండియా పేస్ దళంలో సిరాజ్ మినహా మిగతావారికి చెప్పుకోదగ్గ అనుభవం లేదు.
- ఈ పర్యటనకు మహమ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. ఉమేశ్ యాదవ్‌కు ఉద్వాసన పలికింది. కాగా జస్ప్రీత్ బుమ్రా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఇప్పుడున్న జట్టు పేసర్లలో ఉనాద్కత్ సీనియర్ అయినప్పటికీ.. అతడు ఇప్పటివరకు ఆడింది రెండంటే రెండే టెస్టు మ్యాచ్‌లు. ఇక పేస్ దళానికి సిరాజ్ నాయకత్వం వహించాల్సి ఉంటుంది.
- Siraj Test Career : సిరాజ్‌కు కూడా టెస్టుల్లో ఘనమైన రికార్డేమీ లేదు. ఇప్పటివరకు 19 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరాజ్.. 52 వికెట్లు పడగొట్టాడు.
- మిగిలిన బౌలర్లు ఉనాద్కత్, శర్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, ముఖేశ్ నలుగురు టెస్టుల్లో తీసిన వికెట్లు 36 మాత్రమే.. ఈ గణాంకాలు చూస్తే..
అశ్విన్ ప్రభావం..
Ashwin vs West Indies Test : భారత్ చివరిసారిగా 2019లో వెస్టిండీస్‌తో టెస్టులు ఆడినప్పుడు కూడా అశ్విన్‌ను ఆడించలేదు. అతడు విండీస్‌పై 2016లో చివరిసారిగా ఆడాడు. అశ్విన్‌కు కరీబియన్ జట్టుపై మెరుగైన రికార్డే ఉంది. 2016 టెస్టు సిరీస్‌లో ఆడిన అశ్విన్ బ్యాటుతో 235 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. ఇక బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు నేలకూల్చాడు. ఈసారి కూడా అశ్విన్ రాణిస్తే.. టీమ్ఇండియాకు కలిసొస్తుంది.
కలవరపెడుతున్న మూడో స్థానం..
పుజారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన తర్వాత టీమ్ఇండియాలో మూడో స్థానానికి ఇన్ని రోజులు ఎలాంటి లోటు లేకుండా సాగింది. ద్రవిడ్ తర్వాత పుజారా.. సమర్థవంతంగా రాణించి నూరు శాతం ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. 1996 నుంచి టీమ్ఇండియా ఆడిన 271 టెస్టు మ్యాచ్‌ల్లో.. వీరిద్దరే 230 మ్యాచ్‌ల్లో ఆ స్థానాన్ని భర్తీ చేశారంటే, ఇన్నేళ్లు వీరి ఆట ఎంత నిలకడగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న యువ క్రికెటర్లలో ఎవరు ఈ స్థానాన్ని భర్తీ చేయగలరా అని క్రికెట్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు.
IND vs WI 2023 : ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. యువ ఆటగాళ్లతో నిండి ఉన్న టీమ్ఇండియా.. కరీబియన్ గడ్డపై సవాళ్లు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని డబ్ల్యూటీసీ 2025లో మొదటి విజయం సాధించాలని ఆరాటపడుంతోంది అనడంలో సందేహం లేదు.