లాక్డౌన్ అనంతరం జరిగిన తొలి రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయింది భారత్. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న కోహ్లీ సేన ఇప్పటికే వన్డే సిరీస్‌ను కంగారూలకు కోల్పోయింది. ఈ నేపథ్యంలో నామమాత్రమైన మూడో వన్డే కాన్బెర్రా వేదికగా బుధవారం జరగనుంది. ఉదయం 9.10 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే.. మ్యాచ్ జరగనున్న మనుకా ఓవర్ మైదానంలో ఆసీస్ ఇప్పటివరకు ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఓడిపోలేదు.
మరోవైపు.. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3తో క్లీన్‌స్వీప్‌కు గురైంది భారత్. ఆసీస్‌తో చివరి మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి మరో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని చూస్తోంది.
పరువు కాపాడుకోవాలి!
తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమికి పేలవ బౌలింగే కారణం. ఈ నేపథ్యంలో.. మూడో వన్డేలో మార్పులు జరగొచ్చు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న నవదీప్ సైనీ స్థానంలో శార్దుల్ ఠాకూర్ లేదా నటరాజన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి.
స్పిన్నర్లు చాహల్, జడేజా కూడా వికెట్లు తీయలేకపోతున్నారు. కోహ్లీ తొందరపాటు బౌలింగ్ మార్పులు కూడా భారత్ ఓటమికి కారణమయ్యాయి. ఇప్పటికే దీనిపై మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇంకా టీ-20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో గెలుపు భారత్‌కు తప్పనిసరి. విజయం సాధిస్తే.. పొట్టి ఫార్మాట్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కావొచ్చు.
బ్యాటింగ్‌లో టీమిండియా బలంగానే ఉంది. కోహ్లీ, రాహుల్ మెరుగ్గానే కనిపిస్తున్నారు. శ్రేయస్ ఇన్నింగ్స్ మంచిగానే ప్రారంభిస్తున్నప్పటికీ.. భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు.
క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన ఆసీస్
ఆసీస్‌లో స్టార్ ఓపెనర్ వార్నర్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇది ఆ జట్టుకు లోటే. అయితే.. చక్కటి బ్యాటింగ్ ఫామ్ కనబరుస్తోన్న స్మిత్, ఫించ్, చివరి ఓవర్లలో దూకుడుగా ఆడుతోన్న మాక్స్వెల్, లబూషేన్ ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే జోరు కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది కంగారూ జట్టు.
జట్లు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధవన్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, నటరాజన్.
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డార్సీ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ కేరీ (కీపర్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్, అస్టిన్ అగర్, కామెరూన్ గ్రీన్, హెన్రిక్స్, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్).
ఇదీ చదవండి:కోహ్లీ ఇకనైనా మేలుకో.. లేదంటే అంతే!