టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొవిడ్ టీకా తొలి డోస్ తీసుకున్నాడు. ప్రతి ఒక్కరూ వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరాడు. మరో భారత క్రికెటర్ ఇషాంత్ శర్మతో పాటు అతని భార్య ప్రతిమా సింగ్ కూడా కరోనా టీకా తీసుకున్నారు. గత వారం ఉమేష్ యాదవ్, ఆజింక్య రహానె, శిఖర్ ధావన్ టీకా తొలి డోస్‌ను తీసుకున్నారు.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం జూన్ 2న ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది భారత జట్టు. ఆ సమయానికి ఆటగాళ్లందరూ తొలి డోస్ టీకా తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, రెండో డోస్‌పై సందిగ్ధం నెలకొంది.
"18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌కు అనుమతించింది భారత ప్రభుత్వం. దీంతో క్రికెటర్లు ఒక్కొక్కరుగా టీకా తీసుకుంటున్నారు. కానీ, రెండో డోస్ ఎప్పుడు ఇస్తారనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో కలిసి పనిచేయాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు యూకే ప్రభుత్వం ఒప్పుకోకపోతే.. తిరిగి భారత్‌లోనే రెండో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది." అని ఆ అధికారి తెలిపారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జూన్ 18-22 వరకు జరగనుంది. జూన్ 23వ తేదీని రిజర్వ్ డేగా ప్రకటించారు.
ఇదీ చదవండి: 'ఆ విషయంలో కోహ్లీని మించిన వారే లేరు'