India Australia T20 Series : ఆసియాకప్‌లో ఎదురైన సమస్యలకు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌ల ద్వారా పరిష్కారం చూపాలని కెప్టెన్ రోహిత్ శర్మ భావిస్తున్నాడు. ఆసియాకప్‌లో టీమ్ ఇండియా మెరుగ్గానే బ్యాటింగ్ చేసినా ఆ టోర్నీలో భారత జట్టు అనేక ప్రయోగాలు చేసింది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ విభాగంలో లోపాలు స్పష్టంగా కనిపించాయి. జస్‌ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ రాకతో ఈ విభాగం పటిష్ఠంగా మారింది.
ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన పోరులో ఓపెనర్‌గా అవతారమెత్తిన విరాట్ కోహ్లీ.. సెంచరీతో కదంతొక్కాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మళ్లీ ఓపెనర్‌గా వస్తాడా లేడా అనేది ప్రశ్నార్థంగా మారింది. దీనిపై సమాధానమిచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ప్రపంచకప్‌లో మాత్రం కేఎల్ రాహుల్‌తో కలిసి తాను ఇన్నింగ్స్ ఆరంభించనున్నట్లు స్పష్టం చేశాడు. అంతకంటే ముందు కోహ్లీ కొన్ని మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగవచ్చని సంకేతాలిచ్చాడు.
టాప్ ఆర్డర్‌లో రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఉండగా.. మిడిల్ ఆర్డర్‌లో ఎవరికి చోటు కల్పించాలి అనేదే భారత్‌కు సమస్యగా మారింది. రిషభ్ పంత్, దినేష్‌కార్తీక్‌లలో ఎవరికి తుదిజట్టులో చోటివ్వాలి అనే దానిపై టీమ్ ఇండియా మల్లగుల్లాలుపడుతోంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైన వేళ.. లెఫ్ట్ హ్యాండెడ్ పంత్‌పైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే టీ20ల్లో పంత్ సరైన ఫామ్‌లో లేకపోవడం సమస్యగా మారింది.
మరోవైపు ఆసియాకప్‌లో దినేష్ కార్తీక్‌కు కూడా పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. దీపక్ హుడా ఆసియాకప్‌లోని అన్ని సూపర్-4 మ్యాచ్‌లు ఆడగా జట్టులో అతని స్థానంపై ఇంకా స్పష్టత రావడం లేదు. జడేజా జట్టుకు దూరం కావడం టీమ్ ఇండియా బౌలింగ్ బ్యాలెన్స్‌ను దెబ్బతీసింది. ఆసియాకప్‌లోని కొన్ని మ్యాచ్‌ల్లో భారత జట్టు ఐదుగురు బౌలర్లతోనే ఆడాల్సి వచ్చింది. రవీంద్ర జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు చోటిస్తే భారత్‌కు ఆరవ బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, భువనేశ్వర్, హర్షల్ పటేల్, హార్దిక్ పాండ్యా, స్పిన్నర్లుగా అక్షర్, చాహల్ జట్టుకు అండగా ఉంటారు. అయితే ప్రపంచకప్ జరిగే ఆస్ట్రేలియాలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి కనుక భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆ అంశాన్ని దృష్టిలోపెట్టుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఆస్ట్రేలియా కొంత మంది స్టార్ ఆటగాళ్లు లేకుండానే భారత పర్యటనకు వచ్చింది. డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమౌతూ ఇటీవల వన్డేలకు గుడ్‌బై చెప్పిన సారథి ఆరోన్ ఫించ్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ప్రపంచకప్‌నకు ముందు ఫామ్‌లోకి రావాలని ఫించ్ కోరుకుంటున్నాడు. సింగపూర్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్.. ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేయనున్నాడు.
ఇవీ చదవండి: బౌలర్లు.. గాడిన పడతారా? కప్పు తెస్తారా?