West indies first test match : వెస్టిండీస్‌తో సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఇరు జట్లు ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. అయితే మొదటి టెస్టు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నా... బౌలింగ్ కూర్పుపై టీమ్‌ఇండియా ఓ స్పష్టతకు రాలేదు. నలుగురు బౌలర్లపై ఓ క్లారిటీ ఉన్నా.. ఐదో బౌలర్‌గా ఎవరిని తీసుకోవాలన్న దానిపై మల్లాగుల్లాలు పడుతోంది.
ఎందుకంటే.. మొదటి టెస్టు ది విండర్స్ పార్క్ (డొమినికా) వేదికగా జరగనుంది. ఇది సబీనా పార్క్‌లా గొప్ప పేరున్న మైదానం ఏమీ కాదు. ఇప్పటివరకు అక్కడ ఐదు టెస్టులు, నాలుగు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు మాత్రమే నిర్వహించారు. చివరిసారి 2017లో అక్కడ ఓ టెస్టు మ్యాచ్ జరిగింది. అందులో దాయాది జట్టు పాకిస్థాన్ 101 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ఆ మ్యాచ్ మూడు రోజుల్లోనే పూర్తైంది. కాబట్టి.. చాలా కాలం తర్వాత మళ్లీ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. విండర్స్ పార్క్ పిచ్ స్వభావంపై ఎలాంటి అంచనాకు రాలేకపోతున్నారు. అందుకే ఈ పిచ్‌పై ఐదో బౌలర్ కోసం ఎవరిని ఎంచుకోవాలో అని తెగ కష్టపడుతున్నారు.
Teamindia fifth bowler : నలుగురు క్లారిటీ.. ఐదో బౌలరే ఆసక్తికరం.. టీమ్‌ఇండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా, పేసర్లు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్‌లతో విండీస్ పోరులోకి బరిలోకి దిగనుంది. దీంతో ఐదో బౌలర్ మూడో పేసర్‌గా ఎవరిని తీసుకుంటారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే ఈ ఐదో స్థానం కోసం ఫాస్ట్ బౌలర్లు ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముకేశ్ కుమార్ పేర్లు పరిశీలిస్తోంది. వీరి మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. రంజీల్లో ఎడమచేతి వాటం ఉనద్కత్‌కు మంచి రికార్డుంది. రైట్ హ్యాండ్ బ్యాటర్లకు బాగా సమస్యలు సృష్టించగలిగే స్పెషాలిటీ అతడిలో ఉంది. ఇక నవ్‌దీప్ సైని నెమ్మదిగా లయను అందుకుంటున్నాడు. పేస్ తగ్గకుండా సుదీర్ఘ స్పెల్స్ సంధించగలగే సామర్థ్యం ఉంది. మరో ప్లేయర్ 29 ఏళ్ల ముకేశ్ విషయానికొస్తే.. గత మూడు రంజీ సీజన్లలో అతడు ఎంతగానో మెరుగయ్యాడు. మరీ ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయలేడు కానీ.. బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉంది. మరి టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్.. ఈ ముగ్గురు ప్లేయర్స్‌లో ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి..
ఇదీ చూడండి :
'ఆ ముగ్గురికి ఝలక్ ఇవ్వకపోతే.. విండీస్ చేతిలో టీమ్ఇండియాకు ఓటమి తప్పదు!'
చెలరేగిన బ్రూక్.. బోణీ కొట్టిన ఇంగ్లాండ్.. సిరీస్ ఆశలు సజీవం