Ind vs Wi T20 : భారత్ - వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా బ్యాటర్ల ప్రదర్శన విమర్శలకు దారి తీసింది. ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ప్లేయర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే ఈ మ్యాచ్‌లో ఓటమి అంతరం స్పల్పంగానే ఉన్నా.. చిన్న టార్గెట్‌ను ఛేదించలేకపోయారని ఫ్యాన్స్ మండిపడ్డారు. అందుకే రెండో మ్యాచ్‌లో.. జట్టులో స్వల్ప మార్పులు చేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత జట్టులో ఎవరిపై వేటు పడే అవకాలున్నాయంటే..
అతనిపై నమ్మకంతో..
Shubman Gill T20 Career : ఈ పర్యటనకు ముందు శుభ్‌మన్ గిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ టెస్టుల్లో పెద్దగా ప్రభావం చూపనప్పటికీ.. గిల్‌పై మేనేజ్మెంట్ నమ్మకముంచింది. రెండు వన్డేల్లోనూ విఫలమైన గిల్ మూడో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ పర్యటనకు ముందు ఐపీఎల్లో చెలరేగిన గిల్.. టీ20లో అదరగొట్టడం ఖాయమనుకున్నారంతా. కానీ అనుహ్యంగా తొలి టీ20లో.. తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి మళ్లీ నిరాశపర్చాడు.
వన్డేల్లో జోరు.. మరీ టీ20ల్లో..
Ishan Kishan T20 Career : వన్డేల్లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్.. తొలి టీ20లో క్రీజులో ఇబ్బందిగా కనిపించాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న ఇషాన్ చేసింది ఆరు పరుగులే. పైగా గత 15 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతడు ఒక్కసారి కూడా 50 మార్క్ దాటలేదు. ఇక జట్టులో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ ఉండటం వల్ల ఇషాన్‌ను పక్కన పెడతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ మ్యాచ్‌లో జైస్వాల్ ఎంట్రీ ?
ఇదే టూర్లో టెస్టుల్లో అరంగేట్రం చేసి.. ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్.. టీ20ల్లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. వన్డేల్లో కూడా అవకాశం రాని కారణంగా.. గిల్ లేదా ఇషాన్‌ను రెండో మ్యాచ్‌లో పక్కనపెట్టి జైస్వాల్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది. గుయానా ప్రావిడెన్స్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదికకానుంది.