IND vs SA Test: టీమ్ఇండియా గత మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తున్నా ఎప్పుడూ జోహానెస్‌బర్గ్‌లో ఓటమిపాలైంది లేదు. కానీ, ఈసారి మాత్రమే విఫలమైంది. అలాగే ఇంతకుముందెన్నడూ సెంచూరియన్‌లో విజయం సాధించింది లేదు. కానీ, ఈసారి అక్కడ చరిత్ర తిరగరాసి తొలి టెస్టు కైవసం చేసుకుంది. అలాంటి టీమ్‌ఇండియా సఫారీ గడ్డపై ఓటమి భయమే లేని జోహానెస్‌బర్గ్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్ కోల్పోయింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయాలపై దృష్టిసారిస్తే పలు కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సమష్టి విఫలమేనా..
ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (50), రవిచంద్రన్ అశ్విన్ (46) మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ముఖ్యంగా సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారా (3), రహానె (0) విఫలమయ్యారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో గావస్కర్ లాంటి దిగ్గజం కూడా వాళ్లిద్దరికీ రెండో ఇన్నింగ్సే చివరి అవకాశం అన్నారు. దీంతో ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు రాహుల్ (8), మయాంక్ (23) విఫలమైనా పుజారా (53), రహానె (58) రాణించారు. అర్ధ శతకాలతో ఆదుకున్నారు. హనుమ విహారి (40) కూడా వీలైనన్ని పరుగులు చేయగా.. చివరికి భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌పై భారత బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బౌలింగ్ పట్టు తప్పింది..
ఈమధ్య గెలిచిన అన్ని టెస్టుల్లో ప్రత్యర్థులను రెండు ఇన్నింగ్స్‌ల్లో భారత బౌలర్లు ఆలౌట్ చేశారు. దీంతో వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్నారు. కాగా సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ పేస్ బౌలర్లు సమష్టిగా రాణించడం వల్ల టీమ్‌ఇండియా ఈసారి అక్కడ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ప్రధాన పేసర్ జస్ప్రిత్ బుమ్రా పూర్తిగా విఫలమయ్యాడు. సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మూడు వికెట్లే పడగొట్టాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో (7/61) కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకూర్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఇంతకుముందు శార్దూల్ ఆడిన పలు టెస్టుల్లో కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో తన వంతు కృషి చేశాడు. తొలి టెస్టులో ఆకట్టుకున్న మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయాడు.
బాధ్యతగా ఆడాల్సిన సమయంలో..
Pant Failure: ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపర్చింది వికెట్ కీపర్ రిషభ్ పంత్. అతడెంత మేటి ఆటగాడో అందరికీ తెలిసిందే. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల నేర్పరి. తన దూకుడుతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేయగల సమర్థుడు. అయినా, తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగులే చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి రాగానే భారీ షాట్‌కు ప్రయత్నించాడు. దీంతో ఎదుర్కొన్న మూడో బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి డకౌటయ్యాడు. పంత్ దూకుడుగా ఆడటం తప్పు కాకపోయినా సందర్భానుసారం బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బౌన్సీ పిచ్‌పై బంతి ఎలా పడుతుంది.. పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి. కానీ, అలా కాకుండా అనవసరంగా వికెట్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ విషయంపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అతడితో మాట్లాడతామని చెప్పాడు. దీంతో పంత్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫీల్డింగ్ లోపాలు..
టీమ్‌ఇండియా ఇటీవల ఎంత బాగా ఆడుతున్నా అప్పుడప్పుడూ క్యాచ్‌లు వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకు కూడా ఈ సమస్య ఉన్నా దాన్ని ఇటీవల కాస్త సరిదిద్దుకున్నారు. కానీ, మళ్లీ ఈ దక్షిణాఫ్రికా పర్యటనలో క్యాచ్‌లు జారవిడుస్తూ అవకాశాల్ని కోల్పోతున్నారు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులోనూ భారత ఫీల్డర్లు పలు క్యాచ్‌లు వదిలేశారు. అలాగే ఈ మ్యాచ్‌లోనూ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో రెండు క్యాచ్‌లు వదిలేయడం మనం చూశాం. దీంతో ఈ సమస్య కూడా టీమ్‌ఇండియా ఓటమికి ఒక కారణంగా చెప్పొచ్చు. అశ్విన్ బౌలింగ్‌లో వాండర్ డస్సెన్ వికెట్ల వెనుక ఇచ్చిన క్యాచ్‌ను పంత్ జార విడువగా.. శార్దూల్ బౌలింగ్‌లో తెంబా బవుమా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను వదిలేశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 180/3గా నమోదైంది. అంటే ఆ జట్టు విజయానికి అప్పటికీ 60 పరుగుల దూరంలో ఉంది.
కెప్టెన్సీ అనుభవం లోపమా?
Virat Kohli Injury: గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపించాడు. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అయితే ఈ ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం వీరిద్దరికీ ఇదే తొలిసారి. దీంతో వీరు సహ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో విఫలమయ్యారని విశ్లేషకులు అంటున్నారు. కాగా.. గతేడాది కోహ్లీ లేకపోయినా అజింక్యా రహానే సారథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ విజయం సాధించింది భారత జట్టు. అప్పుడు జట్టులో ప్రధాన పేసర్లు ఎవరూ లేరు. అయినా అప్పుడు సిరీస్ గెలిచిన భారత్ నుంచి ఇప్పుడు ఇలాంటి ప్రదర్శనను మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఏదైమైనా ఇది జట్టు సమష్టి వైఫల్యమని చెప్పొచ్చు.