IND vs SA: ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, విండీస్.. వంటి హేమాహేమీ జట్లను వారి సొంత మైదానాల్లో ఓడించి మరీ సిరీస్‌లను కైవసం చేసుకుంది టీమ్‌ఇండియా. దక్షిణాఫ్రికా విషయంలో మాత్రం ఆ కల మూడు దశాబ్దాలుగా కలగానే మిగిలిపోయింది. నేటి వరకు దక్షిణాఫ్రికా గడ్డ మీద టీమ్ ఇండియా ఒక్క సిరీస్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఇది వరకు ఏడు సార్లు సౌతాఫ్రికాలో పర్యటించిన భారత్.. ఒక్కసారి కూడానూ సిరీస్‌ను అందుకోలేక వెనుదిరిగింది. ఇప్పుడు మరోసారి టీమ్‌ఇండియాకు ఆ జట్టును ఓడించే అవకాశం వచ్చింది. 30 ఏళ్ల కలను సాకారం చేసుకునే భాగ్యం అల్లంత దూరంలోనే ఉంది. అయితే దానిని అందుకోవాలంటే మరికాస్త చెమటోడ్చాల్సిందే!
మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాకు వచ్చింది. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కిదే తొలి విదేశీ పర్యటన ఇదే. ఫ్రీడమ్ సిరీస్‌లో భాగంగా విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్టు జట్టు సెంచూరియన్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మిగిలినవి రెండు టెస్టులు. వీటిలో ఒకటి గెలిచినా.. రెండూ డ్రాగా ముగించినా సరే సిరీస్ టీమ్‌ఇండియా వశమవుతుంది. రెండో టెస్టు మ్యాచ్ జనవరి 3 నుంచి ఏడో తేదీ వరకు, మూడో టెస్టు జనవరి 11 నుంచి జనవరి 15 వరకు జరగనుంది. అయితే రెండో టెస్టు మ్యాచ్ జరిగేలోపు మన ఆట తీరులో కొన్నింటిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
బ్యాటింగ్‌లో వారిద్దరే రాణించారు..
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 327 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (123), మయాంక్ అగర్వాల్ (60) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. రహానె (48), కోహ్లీ (35) కాస్త ఫర్వాలేదనిపించారు. పుజారా గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో బుమ్రా (14) మినహా ఎవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోవడంలో భారత్ విఫలమైంది. అయితే టీమ్‌ఇండియా బౌలర్లు దక్షిణాఫ్రికాను తక్కువ (197) స్కోరుకే పరిమితం చేశారు కాబట్టి సరిపోయింది. ఓ మోస్తరు ఆధిక్యంతో (130) రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 174 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయాల్లో వికెట్లను కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మరోమారు బౌలర్లు విజృంభించడం వల్ల విజయం టీమ్‌ఇండియా సొంతమైంది. ఒకరిద్దరు మాత్రమే కాకుండా జట్టులోని ప్రతి ఆటగాడు ఆడితేనే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. వచ్చిన అవకాశాలను బ్యాటర్లు సద్వినియోగం చేసుకుంటే.. బౌలర్లకు కాస్త స్వేచ్ఛ దొరికి ఇంకా అత్యుత్తమంగా రాణించే వీలు కలుగుతుంది.
సారథీ.. ఇలాగైతే ఎట్టా మరి!
విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో శతకం లేకుండానే ఈ ఏడాదిని ముగించాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు మ్యాచ్‌లో 35 పరుగులు (తొలి ఇన్నింగ్స్), 18 పరుగులు (రెండో ఇన్నింగ్స్) చేశాడు. మరోవైపు ప్రొటీస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ మాత్రం తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగే చేసినా.. రెండో ఇన్నింగ్స్‌లో తన జట్టు ఓడిపోకూడదని అర్ధశతకం (77)తో పోరాడాడు. మరి అలాంటి తెగువ కనబరచడంలో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. దక్షిణాఫ్రికాపై తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలిపించిన నాయకుడిగా అరుదైన రికార్డును సొంతం చేసుకునే అవకాశం విరాట్ కోహ్లీ ముగింట నిలిచింది. దానిని సాధించాలంటే బ్యాటర్‌గానూ రాణించి పరుగులు చేస్తేనే రికార్డు దక్కుతుంది.
వారిలో ఒకరిపై వేటు పడేనా..?
దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చే ముందే తమపై వేటు కత్తి వేలాడుతోందని సీనియర్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానెకు తెలుసు. తొలి మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని రహానె కాస్త సద్వినియోగం చేసుకున్నట్లే కనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా మాత్రం విఫలమయ్యాడు. అసలే శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, సాహా వంటి వారు అవకాశం కోసం వేచి చూస్తున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టు కోసం జట్టు మేనేజ్‌మెంట్ పుజారా, రహానెలో ఒకరిపై వేటు వేసి కొత్తవారికి ఛాన్స్ ఇస్తుందా..? లేదా..? వారిద్దిరినే కొనసాగిస్తుందో లేదో మరి.
బౌలర్లు సూపర్..
తొలి టెస్టు మ్యాచ్‌లో ఎలాంటి ఫిర్యాదు లేనిది మన బౌలర్లపైనే. గత కొన్నేళ్లుగా విదేశీ గడ్డ మీద టీమ్‌ఇండియా ఫాస్ట్ బౌలర్లు చెలరేగుతున్నారు. మ్యాచ్‌పై పట్టు సడలనీయకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫాస్ట్‌బౌలర్లు మహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా.. శార్దూల్ ఠాకూర్ కూడా కీలక సమయంలో వికెట్లు తీసి అండగా నిలిచాడు. స్పిన్‌కు అంతగా అనుకూలించని పిచ్ మీద అశ్విన్ రెండు వికెట్లను మాత్రమే పడగొట్టినా.. పరుగులు ఇవ్వకుండా నియంత్రించగలిగాడు. రెండో టెస్టు మ్యాచ్ కేప్‌టౌన్ వేదికగా జరగనుంది. పిచ్ పరిస్థితిని బట్టి తుది జట్టు ఎంపిక ఉండే అవకాశం ఉంది. మిగతా మ్యాచుల్లోనూ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశం టీమ్‌ఇండియా సొంతమవుతుంది.
ఇవీ చూడండి: