IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు ఐదో రోజు ఆటలో సౌతాఫ్రికా బ్యాటర్ తెంబా బావుమా పాదాలపై టీమ్‌ఇండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ బంతిని బలంగా విసిరాడు. దీంతో బావుమా తీవ్రమైన నొప్పితో విలవిల్లాడాడు. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 62వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సిరాజ్ విసిరిన గుడ్ లెంగ్త్ బంతిని బావుమా డిఫెన్సివ్ షాట్ ఆడాడు. వెంటనే సిరాజ్ బంతిని అందుకుని బావుమా పైకి విసిరాడు. అది బావుమా పాదాలకు తగిలింది. ప్రస్తుతం బావుమా తీవ్రమైన నొప్పితో ఉన్నాడు.
సిరాజ్ దూకుడుగా ప్రవర్తించడంపై భారత మాజీ ఆటగాడు సునీల్ గావాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బావుమా పరుగు తీసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని, అప్పుడు సిరాజ్ ఆ బంతిని తిరిగి బ్యాటర్‌పైకి విసిరే అవసరం లేదని గావస్కర్ అన్నారు. ఎవరైనా వెళ్లి సిరాజ్‌తో మైదానంలో అతడి దూకుడు గురించి మాట్లాడాలని సూచించారు.
"బావుమా పరుగు తీసే ప్రయత్నం చేయలేదు. కాబట్టి సిరాజ్ బంతిని అలా విసరాల్సిన అవసరం కచ్చితంగా లేదు. ఒకవేళ అతడు పరుగు కోసం ప్రయత్నిస్తే సిరాజ్ చేసిన దాంట్లో అర్థముండేది. సిరాజ్ దూకుడు గురించి ఎవరైనా మాట్లాడాలి" అని గవాస్కర్ పేర్కొన్నారు. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో జనవరి 3న ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: కొడుకుపైనా దయ చూపని బ్రెట్‌లీ.. క్లీన్‌బౌల్డ్ చేసి!