IND vs SA Series: ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ టెస్టు సిరీస్ నెగ్గలేదు. ఈ సారి ఆ లోటు తీర్చాలనే పట్టుదలతో టీమ్‌ఇండియా ఉంది. కానీ మన జట్టు సఫారీ గడ్డపై అడుగు పెట్టకముందే ఎదురు దెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో రోహిత్ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతని సేవలు కోల్పోవడం జట్టుకు ఇబ్బందే. ఇప్పుడీ సిరీస్‌లో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంది. అందుకు ముఖ్యంగా ముగ్గురి ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి.
మూడేసి చొప్పున టెస్టులు, వన్డేల సిరీస్ కోసం టీమ్‌ఇండియా త్వరలోనే దక్షిణాఫ్రికా బయల్దేరనుంది. ఈ నెల 26న ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభమవుతుంది. రోహిత్ స్థానంలో ప్రియాంక్ పాంచాల్‌ను జట్టులోకి తీసుకున్నారు. మరోవైపు న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఓ శతకం, అర్ధసెంచరీ చేసిన మయాంక్ అగర్వాల్ సఫారీతో సిరీస్‌లో ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. కాకపోతే కివీస్‌తో సిరీస్‌లో అతనితో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన శుభ్‌మన్ గిల్ కూడా గాయం కారణంగా దక్షిణాఫ్రికా వెళ్లడం లేదు. దీంతో మయాంక్‌కు జోడీ ఎవరనే చర్చ మొదలైంది. మరో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్, ప్రియాంక్, హనుమ విహారిల పేర్లు వినిపిస్తున్నాయి.
అతనికే ప్రాధాన్యం
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో మరో ఓపెనర్ కేఎల్ రాహులే అనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో సిరీస్‌లో రోహిత్‌తో కలిసి అతను ఇన్నింగ్స్ ఆరంభించాడు. కఠినమైన పరిస్థితుల్లోనూ గొప్పగా రాణించాడు. ఆ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను తొడ కండరాల నొప్పి కారణంగా న్యూజిలాండ్‌తో టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పుడు దాని నుంచి పూర్తిగా కోలుకున్న అతను.. సఫారీ గడ్డపై మయాంక్‌తో కలిసి ఓపెనింగ్ చేయడం ఖాయం.
ప్రియాంక్‌కు నిరాశే
అలాగే, 100 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 7,011 పరుగులు చేసిన ప్రియాంక్ పాంచాల్ నేరుగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుతో అరంగేట్రం చేసే సూచనలు కనిపించడం లేదు. రోహిత్ స్థానంలోనే తను జట్టులోకి వచ్చినప్పటికీ పరిస్థితులన్నీ అతనికి అనుకూలంగా మారితే అప్పుడు ఆడే అవకాశాలుంటాయి.
విహారికి ఛాన్స్?
Hanuma Vihari South Africa Tour: ఇక కివీస్‌తో టెస్టు సిరీస్‌కు విహారిని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో భారత్- ఎ తరపున దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో ప్రత్యర్థి గడ్డపై టెస్టుల్లో అతను గొప్ప ప్రదర్శన చేశాడు. 227 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతనికి తిరిగి జట్టులోకి రావడం ఖాయమనిపిస్తోంది. కానీ పుజారా, రహానె, శ్రేయస్, పంత్ లాంటి ఆటగాళ్లున్న బ్యాటింగ్ ఆర్డర్లో అతనికి మిడిలార్డర్‌లో చోటు దక్కుతుందా? అన్నది సందేహమే. అందుకే అతణ్ని ఓపెనింగ్‌కు పంపే ఆలోచనను కొట్టిపారేయలేం. గతంలోనూ అతనికి ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. పేసర్లు విజృంభించే పిచ్‌లపై ఓపిగ్గా క్రీజులో నిలిచే విహారిని ఓపెనర్‌గా ఉపయోగించుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.