IND vs SA Series: మరో రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమ్ఇండియా. కొంతకాలంగా విదేశాల్లో సత్తాచాటుతున్న భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పిచ్‌లపై మాత్రం తేలిపోతున్నారు. ఇదే గడ్డపై 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది టీమ్ఇండియా. కానీ ద్వైపాక్షిక సిరీస్‌లో మాత్రం రాణించలేకపోతుంది. ఈ పిచ్‌లపై అదరగొట్టాలని కొంతకాలంగా మన ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడట్లేదు. కానీ కొందరు మాత్రం ఆశాజనకమైన ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో 2011 నుంచి సఫారీ గడ్డపై ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్లెవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ
దక్షిణాఫ్రికా పిచ్‌లపై విరాట్ కోహ్లీకి మంచి రికార్డుంది. ఇతడు అక్కడ 26 ఇన్నింగ్స్‌లు ఆడి 1395 పరుగులు సాధించాడు. ఈ పదేళ్లలో సౌతాఫ్రికా పిచ్‌లపై ఓ భారత బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. అలాగే సగటు 63.40, స్ట్రైక్ రేట్ 75.36గా ఉంది. ఇందులో 5 సెంచరీలు, 5 అర్ధశతకాలు ఉండటం గమనార్హం.
శిఖర్ ధావన్
బౌన్సీ పిచ్‌లపై అదరొడుతుంటాడు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్. అలాగే సౌతాఫ్రికాలోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఇతడు ఈ దేశ పర్యటనలో 17 ఇన్నింగ్స్‌లు ఆడి 586 పరుగులు చేశాడు. సగటు 36.62 కాగా స్ట్రైక్ రేట్ 92.28గా ఉంది. ఇందులో 3 అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి.
రోహిత్ శర్మ
ప్రస్తుత టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇతడు అక్కడ ఆడిన 25 ఇన్నింగ్స్‌ల్లో 464 పరుగులు సాధించాడు. సగటు 18.56గా ఉంది. ఇందులో ఒక అర్ధసెంచరీ, ఒక శతకం ఉన్నాయి.
అజింక్యా రహానే
సౌతాఫ్రికా సిరీస్ కంటే ముందు టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి ఇతడిని తప్పించింది బీసీసీఐ. ఇక్కడి పిచ్‌లపై రహానే ప్రదర్శన కూడా అంతంతమాత్రమే ఉంది. పదేళ్లలో ఇతడు అక్కడ 12 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 41.40 సగటుతో 414 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధసెంచరీలు ఉన్నాయి.
ధోనీ
దక్షిణాఫ్రికాలోనే జరిగిన టీ20 ప్రపంచకప్-2007లో జట్టును విజేతేగా నిలిపాడు ధోనీ. కాగా, ఇక్కడి పిచ్‌లపై 20 ఇన్నింగ్స్‌ల్లో 72.06 స్ట్రైక్ రేట్‌తో 405 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు కూడా ఉన్నాయి.