IND vs SA: టీమ్ఇండియా ఇప్పుడు ఒత్తిడిలో కూరుకుపోయిందని దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి అన్నాడు. గురువారం అశ్విన్ బౌలింగ్‌లో ఆ జట్టు సారథి తొలుత ఎల్బీడబ్ల్యూగా ఔటైనట్లు అంపైర్ ప్రకటించినా రివ్యూలో బంతి వికెట్లకుపై నుంచి వెళ్తుందని నాటౌట్‌గా పేర్కొన్నారు. దీంతో విరాట్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అశ్విన్.. స్టంప్ మైక్‌ల వద్ద పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎంగిడి స్పందించాడు.
"వాళ్లు ఇలా స్పందించడం ద్వారా ఎంత ఒత్తిడికి గురువుతున్నారో, ఎంత అసహనానికి లోనయ్యారో తెలుస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి వాటితో ఆయా జట్లు లబ్ధిపొందుతాయి. ఎవరూ తమ భావోద్వేగాలను తీవ్రంగా తీవ్రంగా ప్రదర్శించాలనుకోరు. కానీ, ఇక్కడ టీమ్‌ఇండియా ఎమోషన్స్ చాలా కనిపించాయి. దీంతో వాళ్లు తీవ్ర ఒత్తిడికి గురుతున్నారని అర్థమవుతోంది" అన్నాడు ఎంగిడి.
"ఎల్గర్, కీగన్ సాధించిన భాగస్వామ్యం మా జట్టుకెంతో ఉపయోగకరం. దాంతో వాళ్లు ఆ భాగస్వామ్యానికి తెరదించాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ల భావోద్వేగాలు అలా బయటపడ్డాయి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకంగా స్పందిస్తారు. అయితే, ఆ సమయంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు ఎలా ఉన్నారో అదే మనం చూశాము" అని ఎంగిడి చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకోవాలని ఆశిస్తున్న టీమ్‌ఇండియాకు శుక్రవారం అసలు పరీక్ష ఎదురుకానుంది. ఇప్పటికే సఫారీల జట్టు 212 పరుగుల లక్ష్య ఛేదనలో 101/2 స్కోర్‌తో నిలకడగా ఆడుతోంది. క్రీజులో కీగన్ పీటర్సన్ (48) ఉన్నాడు. ఆ జట్టు విజయానికి ఇంకా 111 పరుగులే అవసరం ఉంది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (30) గురువారం ఆటముగిసే ముందు వికెట్ కీపర్‌కు చిక్కడంవల్ల కోహ్లీసేనకు కీలక వికెట్ లభించి కాస్త ఊరటనిచ్చింది.
అయితే, టీమ్‌ఇండియా శుక్రవారం చరిత్ర సృష్టించాలంటే అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంది. మిగిలిన 8 వికెట్లను త్వరగా పెవిలియన్ పంపాల్సిన అవసరం ఉంది. కానీ, అది జరగాలంటే అద్భుతంగా పోరాడాల్సి ఉంది.
ఇదీ చూడండి: IND vs SA: పంత్‌పై ప్రశంసలు.. మరి వాళ్ల పరిస్థితేంటి?