Ind vs Ire 2nd T20 : భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా రెండో ఆదివారం మ్యాచ్‌లో టీమ్ఇండియా 33 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్.. నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం ఐర్లాండ్‌ను 152 పరుగులకే కట్టడి చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే నెగ్గింది.
యువ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (58), సంజు శాంసన్ (40), రింకూ సింగ్ (38), శివమ్ దూబే (22*) చెలరేగడం వల్ల టీమ్ఇండియా మంచి స్కోర్ సాధించింది. ఐర్లాండ్ బౌలర్లలో మెకర్థీ రెండు, యంగ్, వైట్, అదేర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనలో ఐర్లాండ్ బ్యాటింగ్‌లో బాల్‌బిర్నీ పోరాటం తప్ప అక్కడ చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. తొలి రెండు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 18 పరుగులు చేసిన ఐర్లాండ్ జట్టు.. ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభించినట్లే కనిపించింది. కానీ ప్రసిద్ధ్ బరిలోకి దిగి ఒకే ఓవర్లో టకర్ (0), స్టిర్లింగ్ (0)ను ఔట్ చేసి కథనే మార్చేశాడు. షార్ట్ పిచ్ బంతులతో బ్యాటర్లను హడలెత్తించాడు. దీంతో బ్యాటర్లకు సింగిల్స్ తీయడం కూడా కష్టంగా మారింది. బౌలింగ్‌కు వచ్చిన లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్ గూగ్లీతో టెక్టార్ (7)ను బౌల్డ్ చేయడం వల్ల పవర్‌ప్లేలో ఐర్లాండ్ 31/3 స్కోర్ వద్ద నిలిచింది. బాల్‌బిర్నీ, క్యాంఫర్ (18) తమ ఆట తీరుతో కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నప్పటికీ.. వేగంగా ఆడలేకపోయారు. క్యాంఫర్‌ను బిష్ణోయ్ పెవిలియన్ చేర్చడం వల్ల 10 ఓవర్లకు 63/4తో ఇక ఐర్లాండ్ ఓటమి దాదాపు ఖరారైంది. శివమ్ దూబె వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే రెండు సిక్సర్లతో బాల్‌బిర్నీ చెలరేగిపోయాడు. కానీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా అతనికి అడ్డుకట్ట వేశాడు. అయితే అర్ధశతకం చేసిన తర్వాత సుందర్ బౌలింగ్‌లో బాల్‌బిర్నీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను రుతురాజ్ అందుకోలేకపోయాడు. దీంతో ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న బాల్‌బిర్నీ సిక్సర్లతో సాగిపోయాడు. అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లోనూ సిక్సర్లు సాధించాడు. ఆఖరికి బాల్‌బిర్నీ వికెట్‌ను అర్ష్‌దీప్ దక్కించుకున్నాడు. ఇక అడైర్ (23) సిక్సర్లతో అలరించగా... బుమ్రా చివరి ఓవర్లో వికెట్ తీయడంతో పాటు మొయిడిన్ వేయడం విశేషం.
Ind VS Ireland : రింకు, సంజు దూకుడు.. బంతితో ప్రసిద్ధ్ మెరుపులు.. రెండో టీ20 హైలైట్స్
నాకు ఆ హక్కు ఉంది.. నేను ఎవరితో తప్పుగా ప్రవర్తించలేదు : హర్మన్‌ప్రీత్ కౌర్