Ind Vs Aus 2nd ODI : ప్రపంచకప్‌కు ముందు మన వద్ద మిగిలింది రెండే మ్యాచ్‌లు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఆడనున్న శ్రేయస్ అయ్యర్ ఫిట్‌గానే ఉన్నాడా లేదా.. అసలు అతని ఫామ్ సంగతేంటి.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ రెండు మ్యాచ్‌ల్లోనే తేలిపోవాలి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఫిట్‌నెస్, ఫామ్ చాటుకునేందుకు మంచి అవకాశం లభించినప్పటికీ.. లేని పరుగుకు ప్రయత్నించి రనౌటైపోయాడు. ఇప్పుడు ఈ రెండో వన్డేకు అంతా సిద్ధమైంది. దీంతో ఈ మ్యాచ్‌లో అయినా శ్రేయస్.. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే శ్రేయస్ లాగే పెద్ద గాయంతో కొంత కాలం పాటు ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్ కూడా.. ఆసియా కప్‌తో పునరాగమనం చేసి తన ఫిట్‌నెస్‌తో పాటు ఫామ్‌నూ చాటుకుని జట్టుకు భరోసానిస్తున్నాడు. ఇలాగే శ్రేయస్ కూడా ఊపందుకున్నాడంటే ఇక ప్రపంచకప్ ముంగిట భారత్‌కు పెద్ద భారం దిగిపోయినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Ashwin Australia Series : అక్షర్ పటేల్ గాయం నేపథ్యంలో అనుకోకుండా టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. తొలి వన్డేలో ఓ మోస్తరు ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకోవాలంటే అశ్విన్ ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రెండో వన్డేలో శ్రేయస్, అశ్విన్‌లిద్దరిపై అందరి దృష్టి నిలిచి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Ind Vs Aus 1st ODI : ఇక కెప్టెన్ రోహిత్‌తో పాటు కోహ్లి, హార్దిక్, కుల్‌దీప్ లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఈ తొలి వన్డేలో భారత్ బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆధిపత్యంతో ఆసీస్‌పై సునాయాస విజయాన్ని సాధించింది. సీనియర్ పేసర్ షమి కూడా చాన్నాళ్ల తర్వాత పతాక స్థాయి బౌలింగ్‌తో సత్తా చాటడం పెద్ద సానుకూలాంశంగా మారింది. మిగతా బౌలర్లూ ఆకట్టుకున్నప్పటికీ.. శార్దూల్ మాత్రం ప్రత్యర్థులకు ధారాళంగా పరుగులిచ్చేశాడు. ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో అతను గాడిన పడకుంటే కష్టమని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బ్యాటింగ్‌లో శ్రేయస్ మినహా బ్యాటర్లు మంచి లయతో కనిపిస్తున్నారు. శుభ్‌మన్, రాహుల్ ఫామ్‌ను కొనసాగించగా.. అనుకోకుండా అవకాశం దక్కించుకున్న రుతురాజ్ కూడా తొలి వన్డేలో అదరగొట్టాడు. ఆసియా కప్‌లో జట్టును నడిపించాల్సిన నేపథ్యంలో రెండో వన్డేకు తన స్థానంలో తిలక్ వర్మను ఆడిస్తారేమో చూడాలి.
Australia Tour Of India : మరోవైపు తొలి వన్డే ఓటమి తర్వాత ఆస్ట్రేలియా జట్టు కసితో రగిలిపోతూ ఉంటుందనడంలో సందేహం లేదు. దాదాపుగా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగిన కంగారూలకు.. కీలక ఆటగాళ్లు లేని భారత్ చేతిలో ఓడిపోవడమంటే ఇక ఘోర పరాభవం కిందే లెక్క. పేసర్లకు అనుకూలించే మొహాలి పిచ్‌ను ఆ జట్టు పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. ఇక స్పిన్‌కు సహకరించే ఇందౌర్‌లో ఆసీస్ ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే. స్మిత్, వార్నర్, మిచెల్ మార్ష్ లాంటి సీనియర్ల నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. బౌలింగ్‌లో జంపా నుంచి భారత బ్యాటర్లకు ముప్పు తప్పదు. హేజిల్‌వుడ్ అందుబాటులోకి రానుండటం వల్ల ఆసీస్ పేస్ బలం పెరగొచ్చు. ఇందౌర్ పిచ్ బ్యాటింగ్‌కు కూడా అనుకూలం కాబట్టి భారీ స్కోర్లు నమోదు కావచ్చుని అంచనా.
KL Rahul Australia Series : ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. రాహుల్ కెప్టెన్సీ రికార్డులు ఎలా ఉన్నాయంటే?