పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా(PCB Chairman Ramiz Raja) ఎన్నికయ్యాడు. ఆ బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీమ్ఇండియాతో ద్వైపాక్షిక సిరీస్‌పై స్పష్టత ఇచ్చాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని.. అయినా దానికేమి అంత తొందర లేదని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం తమ దేశంలోని దేశవాళీ క్రికెట్ అభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు తెలిపాడు.
"పీసీబీ అధ్యక్ష పదవి చాలా పెద్ద సవాలుతో కూడుకున్నది. ప్రధానమంత్రి(ఇమ్రాన్ ఖాన్) నాకు ఈ కఠినమైన ఉద్యోగాన్ని నాకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు".
- రమీజ్ రాజా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు
పాకిస్థాన్, భారత్ మధ్య ద్వైపాక్షిక సిరీస్(India Vs Pakistan Bilateral Series) ఎప్పుడు జరుగుతుందని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.."ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అది అసాధ్యం. ఎందుకంటే రాజకీయాలపై ఇప్పుడు క్రీడాటోర్నీ నిర్వహణ ఆధారపడి ఉంది. అయితే భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ కోసం మాకు అంత తొందరేమి లేదు. ప్రస్తుతం పాక్ దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధిగా దిశగా తీసుకెళ్లడం మా ముందున్న కర్తవ్యం" అని రమీజ్రాజా వెల్లడించాడు.
ఏకగ్రీవంగా ఎన్నిక
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి ఎన్నికలో(PCB Chairman Election 2021) ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు మాజీ కెప్టెన్ రమీజ్ రాజా. అయితే గతంలో పీసీబీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఎసన్ మణి పదవీకాలం పూర్తవ్వడం వల్ల ఆయన తప్పుకున్నాడు. ఇటీవలే తాత్కాలిక కోచ్‌లుగా నియమితులైన సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్లూ ఈ మీటింగ్‌కు హాజరయ్యారు.
క్రికెటర్‌గా..
రమీజ్ రాజా.. పాకిస్థాన్ టెస్టు క్రికెట్ జట్టుకు 18వ కెప్టెన్‌గా.. వన్డే టీమ్‌కు 12వ సారథిగా వ్యవహరించాడు. క్రికెట్ కెరీర్ 1984 నుంచి 1997 మధ్యలో 255 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రమీజ్ రాజా.. 8,674 పరుగులను నమోదు చేశాడు. గతంలో పాక్ బోర్డుకు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
టీ20 ప్రపంచకప్ కోసం కొత్త కోచ్‌లు
యూఏఈ వేదికగా జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం కోచ్‌ల బృందంలో(Pakistan New Coaches) ఇద్దరు మాజీ విదేశీ క్రికెటర్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నియమించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ మ్యాథ్యూ హెడెన్‌తో(Matthew Hayden) పాటు దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్లను(Vernon Philander) కోచ్‌లుగా ఎంపికచేసింది.
ఇదీ చూడండి.. ICC POTM: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు విజేతలు వీరే!