కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తరలించడం మంచిదని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్‌లో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన తర్వాత టోర్నీ నిరవధికంగా వాయిదా పడింది. మరోవైపు ఏడాది చివర్లో కరోనా మూడో దశ విజృంభించే ప్రమాదం ఉన్నందున పొట్టి ప్రపంచకప్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే కమిన్స్ ఇలా వ్యాఖ్యానించాడు.
"ఒకవేళ ఈ ప్రపంచకప్‌ను నిర్వహించడం భారత వనరులను దెబ్బతీసినా.. లేదా సురక్షితమైంది కాదని తెలిసినా.. టోర్నీని యూఏఈకి తరలించడం మంచిదని నేను అనుకుంటున్నా. ఆ మెగా ఈవెంట్‌కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం తొందరపాటు అవుతుంది. భారతీయులకు ఏది మంచిదనే విషయంపై క్రికెట్ వర్గాలు ప్రభుత్వంతో చర్చలు జరపడం ముఖ్యం. అలాగే గతేడాది యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్ అద్భుతంగా జరిగింది. అక్కడ బాగా నిర్వహించారు. కానీ, చాలా మంది దాన్ని భారత్‌లోనే నిర్వహించాలని అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే అందరి అభిప్రాయం తెలుసుకొని ఇక్కడే కొనసాగించారు" అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: టోక్యో ఒలింపిక్స్‌కు రెజ్లర్ సుమిత్ అర్హత