ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను అధిగమించి మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన మొదటి టీ20లో అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అనంతరం ఈ ఘనత సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 25 బంతులు ఎదుర్కొన్న సూర్య.. రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 46 పరుగులు సాధించాడు.
ఇక పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్(825) నం.1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన ఐడెన్ మార్‌క్రమ్(792) 2వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ డేవిడ్ మలన్, ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ 5, 6 స్థానాల్లో ఉన్నారు. ఇక మరే ఇతర భారత బ్యాటర్ కూడా టాప్-10లో లేరు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 14, 16, 18వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.
భారత టీ20 లీగ్‌లో చూపించిన ఫామ్‌ను కొనసాగిస్తూ.. భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వీరవిహారం చేయడంతో ఆల్‌రౌండర్ల జాబితాలో టాప్-5లోకి దూసుకొచ్చాడు. రెండు స్థానాలు ఎగబాకి 180 ర్యాంకింగ్ పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకున్నాడు. షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), మహమ్మద్ నబి (అఫ్గానిస్థాన్) ఈ జాబితాలో మొదటి రెండు స్థానాల్లో నిలిచారు.
అయితే బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ రెండు స్థానాలు పడిపోయి 9వ స్థానంలో నిలిచాడు. మరే ఇతర భారత బౌలర్ కూడా టాప్-10లో చోటు సంపాదించలేకపోయారు. జోష్ హేజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా), తబ్రిజ్ షంసి (దక్షిణాఫ్రికా) మొదటి రెండు స్థానాలను దక్కించుకున్నారు.
ఇదీ చూడండి: మహిళల ఆసియా కప్ జట్టును ప్రకటించిన బీసీసీఐ.. షెడ్యూల్ ఇదే