ఐసీసీ తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఇటీవల దిగ్విజయంగా పూర్తయింది. న్యూజిలాండ్ విజేతగా ఆవిర్భవించగా, టీమ్‌ఇండియా రన్నరప్‌గా నిలిచింది. కరోనా వైరస్.. బయో బుడగలు.. వంటి అడ్డంకులు ఎదురైనా తొలి ఎడిషన్ డబ్ల్యూటీసీ ఊహించిన దానికన్నా ఎక్కువే విజయవంతమైంది. దాంతో ఇప్పుడు అందరి చూపు రెండో సీజన్‌పై పడింది. అయితే తొలి సీజన్‌తో పోలిస్తే రెండోదానిలో కొన్ని మార్పులు జరిగాయి. ఈ క్రమంలోనే పాయింట్ల పద్ధతి ఏంటి? ర్యాంకింగ్స్ ఎలా ఇస్తారు? ఏ జట్లు ఎన్ని మ్యాచులు ఆడనుంది?
ఇంగ్లాండ్-భారత్ సిరీస్‌తో ప్రారంభం..
డబ్ల్యూటీసీ-2 వ్యవధి రెండేళ్లు. ఈ ఏడాది ఆగస్టు నుంచి 2023 జూన్ వరకు జరుగుతుంది. ఫైనల్ ఎక్కడ జరుగుతుందో ఇంకా చెప్పలేదు. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగే పటౌడీ సిరీస్‌తో ఛాంపియన్‌షిప్ ఆరంభమవుతుంది. డిసెంబర్లో యాషెస్ సిరీస్ మొదలవుతుంది. ఈ డబ్ల్యూటీసీలో ఐదు మ్యాచుల సిరీసులు ఈ రెండే.
పెద్ద సిరీసులు తక్కువే..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా.. భారత్‌లో పర్యటించనుంది. మొత్తం 4 టెస్టులు ఆడనుంది. ఇవి కాకుండా టోర్నీలో 3 టెస్టుల సిరీసులు 7, రెండు టెస్టుల సిరీసులు 13. తొలి డబ్ల్యూటీసీ మాదిరిగానే ఈ సారీ 9 టెస్టు జట్లు ఆరు సిరీసుల్లో తలపడతాయి. విదేశాల్లో 3, స్వదేశంలో 3 ఉంటాయి. ఎక్కువ టెస్టులతో కూడిన సిరీసులు ఆడుతున్నవి మొత్తంగా భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. మిగతా ఆరు జట్లు గరిష్ఠంగా 3 లేదా 2 మ్యాచుల సిరీసులే ఆడతాయి.
ఎవరెన్ని ఆడతారంటే..
డబ్ల్యూటీసీలో ఇంగ్లాండ్ ఏకంగా 21 టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత స్థానంలో టీమ్‌ఇండియా 19 మ్యాచుల్లో తలపడనుంది. ఆస్ట్రేలియా 18, దక్షిణాఫ్రికా 15 టెస్టులు ఆడతాయి. తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన న్యూజిలాండ్ 13 టెస్టులే ఆడనుంది. వెస్టిండీస్, శ్రీలంకదీ అదే పరిస్థితి. పాకిస్థాన్ 14 మ్యాచులు ఆడనుంది. బంగ్లాదేశ్ మాత్రం అన్ని సిరీసుల్లోనూ 2 మ్యాచులే ఆడనుంది.
గెలిస్తే 12 పాయింట్లు..
కరోనా వైరస్ వల్ల తొలి డబ్ల్యూటీసీకి ఆటంకాలు ఎదురయ్యాయి. కొన్ని మ్యాచులు జరగలేదు. దాంతో పాయింట్ల పద్ధతిని ఐసీసీ హఠాత్తుగా మార్చేసింది. వీటిపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ సారి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది! గెలిచిన జట్టుకు 12 పాయింట్లు కేటాయిస్తారు. డ్రా అయితే 4, టై అయితే 6 పాయింట్లు ఇస్తారు. స్లో ఓవర్‌రేట్‌కు జరిమానా విధిస్తారు. నిర్దేశించిన సమయానికి మించి ఎన్ని ఓవర్లు వేస్తే అన్ని పాయింట్లు కోత విధిస్తారు. ఆడిన మ్యాచులు, గెలుపోటములు, పాయింట్ల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. వీటిని త్వరలో జరిగే ఐసీసీ సమావేశంలో ఆమోదించాల్సి ఉంది.
ఇదీ చదవండి: ICC Rankings: అగ్రస్థానానికి కేన్, కోహ్లీ అదే ర్యాంక్‌లో