PCB Four Nations Tournament plan cancel: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్‌లతో ఏటా నాలుగు దేశాల టీ20 టోర్నమెంట్ నిర్వహించాలన్న పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా ప్రతిపాదనకు ఐసీసీ బోర్డు సమావేశంలో తిరస్కారం ఎదురైంది. భారత్, పాకిస్థాన్ తరచుగా తలపడితే చూడాలన్నది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల కోరిక అని.. ఈ రెండు జట్లకు ఆసీస్, ఇంగ్లాండ్‌లను కూడా కలిపి టీ20 టోర్నీ నిర్వహిస్తే గొప్ప ఆదరణ ఉంటుందని రమీజ్ అభిప్రాయపడ్డాడు. అయితే దుబాయ్‌లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో అతడి ప్రతిపాదనకు ఏ ఒక్కరూ మద్దతునివ్వలేదు. బీసీసీఐ ఈ ప్రతిపాదనకు ఏమాత్రం సుముఖంగా లేకపోవడంతో ఐసీసీ బోర్డు సమావేశంలో రమీజ్ ప్రతిపాదన నిలవదని ముందే తేలిపోయింది. ఇక ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగర్ బార్‌క్లే దిగిపోనున్న సంగతి ఈ సమావేశంలో ఖరారైంది. ఛైర్మన్‌గా మరోసారి బార్‌క్లేను నామినేట్ చేయడంపై చర్చే జరగలేదు. అయితే వెంటనే కాకుండా, అక్టోబరు వరకు బార్‌క్లే పదవిలో కొనసాగనున్నాడు. దీంతో కొత్త ఛైర్మన్ ఎంపిక ప్రక్రియ నవంబరులోనే మొదలు కానుంది. ఈ పదవికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, కార్యదర్శి జై షా పోటీ పడనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
PCB Ramiz Raja Resign: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని రమీజ్ రజా భావిస్తున్నట్లు సమాచారం. రమీజ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నాడు. అతడు ఐసీసీ సమావేశంలో పాల్గొన్నాడు. ‘‘ఇమ్రాన్ ఖాన్ గట్టిగా చెప్పడంతోనే పీసీబీ ఛైర్మన్‌గా ఉండేందుకు రమీజ్ అంగీకరించాడు. అప్పటికి అతడు వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా తీరిక లేకుండా ఉన్నాడు. ఇమ్రాన్ కోరడంతో తన మీడియా కాంట్రాక్టులన్నీ పక్కన పెట్టి పీసీబీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఉన్నంత వరకే పీసీబీ ఛైర్మన్‌గా ఉంటానని అప్పుడు అతడు స్పష్టం చేశాడు’’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: IPL 2022: లఖ్‌నవూకు షాక్.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం