ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ల్లో మంచి ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్, హేజిల్‌వుడ్ లాంటి ఆటగాళ్లను వెనక్కినెట్టి తొలి ర్యాంకుకు చేరుకున్నాడు. 729 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ అగ్ర స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా పేసర్ హేజిల్ వుడ్ 727 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.
బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో టీమ్‌ఇండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. కివీస్‌పై తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్ ఏకంగా 20 స్థానాలు ముందుకు జరిగి ఆరో స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోగా.. రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక పాక్ బ్యాటర్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు.
న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ ఛాంపియప్ ఇంగ్లాండ్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. టీ20ల్లోనూ భారత్ అగ్రస్థానంలో నిలిచింది. త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0, అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ టీమ్‌ఇండియా నంబర్ వన్‌గా నిలుస్తుంది.
ఇదీ చూడండి: మహిళల ఐపీఎల్ జట్ల వేలం పూర్తి.. బీసీసీఐకి కాసుల వర్షం.. ఏకంగా అన్ని వేల కోట్లు