ICC Chairman Election : ఐసీసీ ఛైర్మన్ పదవి విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలో వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో బీసీసీఐ చర్చించనుంది. మంగళవారం కొత్త కార్యవర్గం కొలువుదీరనుండగా.. ఐసీసీ పదవి విషయంలో బీసీసీఐ వ్యూహంపైనే అందరిలో ఆసక్తి నెలకొంది. సౌరభ్ గంగూలీ స్థానంలో బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ మంగళవారం బాధ్యతలు స్వీకరించనున్నాడు. పోటీలో ఎవరూ లేకపోవడం వల్ల అభ్యర్థులంతా ఏకగీవ్రంగా ఎన్నికవడం లాంఛనమే. జై షా (కార్యదర్శి), ఆశిష్ షెలార్ (కోశాధికారి), రాజీవ్ శుక్లా (ఉపాధ్యక్షుడు), దేవజిత్ సైకియా (సంయుక్త కార్యదర్శి)లు బాధ్యతలు చేపట్టనున్నారు.
ఐపీఎల్ ఛైర్మన్ పదవిని అరుణ్ ధుమాల్ స్వీకరించనున్నాడు. ఐసీసీ పదవికి పోటీపడాలా లేదా ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లేకు రెండో దఫా మద్దతు తెలపాలా అన్న విషయంపై బోర్డు చర్చించనుంది. ఈనెల 20న ఐసీసీ ఛైర్మన్ పదవికి నామినేషన్ల గడువు ముగుస్తుంది. నవంబరు 11 నుంచి 13 వరకు మెల్‌బోర్న్‌లో ఐసీసీ బోర్డు సమావేశమవుతుంది. బీసీసీఐ నుంచి సౌరభ్ గంగూలీ నిష్క్రమణపై ఇప్పటికే పెద్ద దుమారం రేగుతోంది. క్రీడా వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐసీసీ పదవికి గంగూలీని అనుమతివ్వాలంటూ ప్రధాని మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.ఐసీసీ పదవికి బోర్డు పోటీపడితే క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ లేదా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి : చిన్న టీమ్‌ల పెద్ద దెబ్బ.. ఛాంపియన్లకు వరుస షాక్‌లు.. బహుపరాక్!
T20 worldcup: టీమ్ఇండియాకు బిగ్ షాక్.. మరో కీలక ప్లేయర్‌కు గాయం