టీమ్‌ఇండియా(Team india) మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ త్వరలో పునరాగమనం చేయబోతున్నాడు. మొన్నటివరకూ భుజం గాయంతో బాధపడిన అతడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక వన్డేలో ఇతడు తీవ్రంగా గాయపడ్డాడు. బౌండరీకి వెళ్లే బంతిని ఆపే క్రమంలో అతడు డైవ్ చేస్తూ కిందపడ్డాడు. దాంతో ఎడమ భుజానికి గాయమైంది. ఆపై శస్త్రచికిత్స చేయించుకున్న అయ్యర్.. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు.
ఇంగ్లాండ్‌తో వన్డేలో గాయపడిన అనంతరం చాలా కుంగిపోయానని, దాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. 'ప్రస్తుతం నేను అద్భుతమైన అనుభూతిని పొందుతున్నా. నిజాయితీగా చెప్పాలంటే నా ప్రయాణం అద్భుతంగా ఉంది. నేనెప్పుడూ వెనుకడుగు వేయలేదు. కానీ భుజానికి గాయం అయిన తర్వాత కొంచెం కుంగిపోయాను' అని అయ్యర్ పేర్కొన్నాడు.
'అప్పుడు ఏం చేయాలో తోచలేదు. గాయం అయిన వెంటనే ఏడుస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లా. దాన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ గాయం అకస్మాత్తుగా జరిగింది. అది ఎలా జరిగిందో నాకు అర్థమైంది. కానీ, ఇది క్రీడాకారుల జీవితంలో ఒక భాగం. కాబట్టి నేను ఆ వాస్తవాన్ని అంగీకరించా' అని శ్రేయస్ అన్నాడు.
ఇవీ చదవండి: