Rashid Khan IPL 2022: నెమ్మదిగా బంతి వేస్తూ.. దాన్ని గింగిరాలు తిప్పేవాళ్లు స్పిన్నర్లు. మంచి వేగంతో వికెట్లను ఎగరగొట్టేవాళ్లు పేసర్లు. కానీ ఈ రెండు కలగలసిన బౌలర్.. రషీద్ ఖాన్. గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే అతను.. తానో స్పిన్ ఫాస్ట్ బౌలర్‌నని చెప్పుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 లీగ్‌ల్లో కీలక ఆటగాడిగా మారిన ఈ 23 ఏళ్ల అఫ్గాన్ స్పిన్నర్.. ఇప్పటికే లీగ్‌ల్లో 312 మ్యాచ్‌ల్లో 436 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ వరకు సన్‌రైజర్స్ ప్రధాన స్పిన్నర్‌గా ఉన్న అతను.. ఈ సారి ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫునా అదరగొడుతున్నాడు.
''వేగంతో బౌలింగ్ చేస్తా కాబట్టి నేను స్పిన్ ఫాస్ట్ బౌలర్‌ని. గంటకు 96 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తా. అంత వేగంతో వేసిన బంతిని స్పిన్ చేయడం చాలా కష్టం. అందుకు విభిన్నమైన నైపుణ్యాలు కావాలి. కానీ వేగాన్ని తగ్గించి బంతిని ఎక్కువగా తిప్పాలనుకోను. వేగంగా లెగ్‌స్పిన్ వేయడానికే ఇష్టపడతా. నేనో లెగ్‌స్పిన్నర్‌నని అనుకోను. ఎందుకంటే ఆ స్పిన్నర్లు తమ మణికట్టును ఎక్కువగా వాడతారు. కానీ నేనా స్థాయిలో మణికట్టును ఉపయోగించను. నా వేళ్లని మాత్రమే ఎక్కువగా వాడతా. నిలకడగా ఒకే లైన్, లెంగ్త్‌లో బంతి వేయడం నా బౌలింగ్ రహస్యం. మన నైపుణ్యాలపై పట్టు ఉండి సరైన ప్రాంతాల్లో బౌలింగ్ వేసినంత కాలం తిరుగుండదు. మిగతా లెగ్‌స్పిన్నర్ల కంటే విభిన్నంగా బౌలింగ్ చేస్తున్నానంటే నా లెంగ్త్ కారణం. తీవ్ర ఒత్తిడిలోనూ బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా.'' అని రషీద్ తెలిపాడు.
ఇవీ చూడండి: చెన్నై చరిత్రలో తొలిసారి అలా!.. 'టీ20ల్లో ధోనీ రికార్డు'