19 ఏళ్లుగా భారత్ గడ్డపై టెస్టు సిరీస్ దక్కించుకోవడంలో ఆస్ట్రేలియా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఆసీస్ వ్యూహాలకు మరింత పదునుపెడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ క్రమంలో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్ కోసం ఆ జట్టు ఎలా సిద్ధమవుతోందన్న అంశంపై ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో 'ది టెస్ట్' సీజన్-2 లఘుచిత్రాన్ని సిద్ధం చేసింది. దీనిలో భారత్ పర్యటనపై ఆసీస్ ఎంతగా దృష్టిపెట్టిందో తెలుస్తోంది.
జనవరి 13వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. సిడ్నీలో జరిగిన ది వరల్డ్ ప్రీమియర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమిన్స్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్, లబుషేన్, నాథన్ లయన్, ట్రావిస్ హెడ్ వంటి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్ పాట్ మాట్లాడుతూ ‘‘ఆ టెస్ట్ జట్టు (2004 నాటి ఆసీస్ టీమ్) ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పరిస్థితులకు ఇట్టే అలవాటు పడిపోతోంది. అవి అద్భుతమైన ప్రమాణాలు. అవే కోరుకునేది. వారు ఇండియాలో గెలిచారు. ఆ జట్టు ఇంగ్లాండ్‌లో గెలిచింది. ఆస్ట్రేలియాలో మీరు కొత్త బంతితో ఇన్నర్ సర్కిల్ ఫీల్డింగ్‌తో విజయం సాధించవచ్చు. కానీ, ఉపఖండంలో పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అక్కడ కొత్త బంతితో ఏమీ చేయలేరు. బ్యాట్‌ను తాకిన బంతి ఆపేందుకు అవుట్‌సైడ్ ఫీల్డింగ్ పెట్టుకోవాలి’’ అని వ్యాఖ్యానించాడు.
ఉపఖండం పిచ్‌ల గురించి వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన అనుభవాన్ని వివరించాడు. 2016లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించిన సమయంలో పక్కా ప్లానింగ్‌తో తొలి టెస్ట్ బరిలోకి దిగిందన్నాడు. కానీ, తమ ప్రణాళిక పూర్తిగా విఫలమై ఓటమి మూటగట్టుకొన్నామన్నారు. ఈ పర్యటనలో మూడు టెస్టులకు మూడు రకాల ప్రణాళికలు అమలు చేసినట్లు వివరించాడు. టెస్టు సిరీస్ ఇప్పటికే ఆసీస్ తమ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: Hockey World Cup 2023: ప్రపంచకప్ సమరానికి భారత్ సై.. 48 ఏళ్ల నిరీక్షణకు తెర పడేనా?