టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న చేదు అనుభవంపై హోటల్ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నామంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.
"మా అతిథులకు(కోహ్లీని ఉద్దేశిస్తూ) కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ తప్పిదాన్ని సరిదిద్దుకునే క్రమంలో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాం. ఈ ఘటనకు బాధ్యులైనవారిని వెంటనే విధుల నుంచి తప్పించాం. అలాగే ఆ హోటల్ గది ఒరిజినల్ వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాం. ఈ తరహా పొరపాట్లు పునరావృతం కాకుండా దర్యాప్తు నిర్వహిస్తున్నాం. ఈ విషయంలో మేం టీమ్ఇండియాకు, అంతర్జాతీయ క్రికెట్ మండలికి సహకరిస్తున్నాం" అని తన ప్రకటనలో వెల్లడించింది.
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా టీమ్‌ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉంది. కోహ్లీ లేని సమయంలో అతడి హోటల్ గదిలోకి వెళ్లిన కొందరు అక్కడి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై భారత బ్యాట్స్‌మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇది చాలా భయానకమని, తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్‌స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు.
ఇదీ చూడండి: T20 worldcup: అప్పుడు పాక్‌కు ఇప్పుడు టీమ్ఇండియాకు ఒకేలా జరిగిందిగా!