శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్లో శిఖర్ ధావన్ తప్పకుండా రాణించాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే నిలకడగా భారీ పరుగులు చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే జట్టులో ప్రతి స్థానానికీ విపరీతమైన పోటీ నెలకొందని గుర్తు చేశారు.
"శిఖర్ ధావన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేకించి టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇప్పటికే ఓపెనర్లుగా స్థిరపడిపోయారు. అవసరమైతే టీ20ల్లో తానే ఓపెనింగ్ చేస్తానని విరాట్ కోహ్లీ సైతం ప్రకటించాడు. అందుకే ధావన్ అందరికన్నా ఎక్కువ పరుగులు చేయాలి. టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా ఎంపికవ్వడం అతడిని ఉత్సాహపరిచేదే. దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు ఎవరైనా గర్వపడతారు. అయితే అతడు పరుగులు చేయడం, జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడంపై దృష్టి సారించాలి."
-వీవీఎస్ లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్.
పొట్టి ఫార్మాట్లో రాహుల్-రోహిత్ జోడీ ఇన్నింగ్స్ ఓపెన్ చేయనున్నారు. 2020కి ముందు శిఖర్ ధావన్ క్రమం తప్పకుండా ఓపెనింగ్ చేశాడు. గాయాలతో ఎప్పుడైతే అతడు దూరమయ్యాడో రాహుల్ విజృంభించాడు. మొత్తంగా 49 ఇన్నింగ్సుల్లోనే 39.92 సగటుతో 1557 పరుగులు చేశాడు. ఇక గబ్బర్ 65 మ్యాచుల్లో 27.88 సగటుతో 1673 పరుగులు చేశాడు. కాగా శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు శిఖర్ సారథ్యం వహిస్తున్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్-15 బ్లూప్రింట్ రెడీ.. మెగా వేలం అప్పుడే!