80 ఏళ్ల చరిత్ర కల్గిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు నాశనం అయిపోతోందని హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ వెంకటస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని కాపాడుకునే బాధ్యత అందరిపైనా ఉందన్నారు. హెచ్‌సీఏలో 218 క్లబ్‌లు ఉన్నాయని.. అందులో ఉన్న వారికి ఎప్పుడు మనస్పర్థలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. హెచ్‌సీఏ వివాదస్పదమవుతున్న తీరుపై వినోద్ వెంకటస్వామి వివరించారు. గతంలో వైఎస్సార్ హయాంలో హెచ్‌సీఏకి 5 ఎకరాల భూమిని ఇప్పించామని.. స్టేడియం నిర్మాణానికి రూ.4.5 కోట్లు ఇచ్చామని వినోద్ పేర్కొన్నారు. క్రికెట్ అభివృద్ధి కోసం తాము ఎప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్‌సీఏలో జరిగే పరిణామాలను చూస్తుంటే బాధేస్తుందన్నారు. జింఖానా మైదానాన్ని సోమవారం మూసేశారని... అలా ఎలా మూస్తారని ప్రశ్నించారు.
ఏజీఎంపై ఎవరికి స్పష్టత లేదు..
హెచ్‌సీఏలో చిల్లర గొడవలు పోవాలంటే... మళ్లీ ఎన్నికలు పెట్టాల్సిందేనన్నారు. అజార్, అపెక్స్ కౌన్సిల్ కూర్చొని మాట్లాడుకోవాలి లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఏజీఎంపై ఎవరికి స్పష్టతలేదన్నారు. అజారుద్దీన్ చెప్పింది ఒకలా.. జాన్ మనోజ్ చెప్పింది మరోలా ఉందన్నారు. అందరూ కూర్చొని సమస్యల్ని పరిష్కరించుకుంటే... హెచ్‌సీఏకి మేలు జరుగుతుందన్నారు. ఇప్పుడున్న కార్యవర్గం సెలెక్షన్ కమిటీల్లో తమ మనుషులనే పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అజార్ హైదరాబాద్ క్రికెట్ కోసం ఇప్పటివరకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్, హెచ్‌సీఏ అధ్యక్షునికి సయోధ్య లేనప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయన్నారు. రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి... కార్యవర్గాన్ని రక్షించాలన్నారు. హెచ్‌సీఏలో బీసీసీఐతో సరిగ్గా మాట్లాడేవాళ్లు లేకపోవడంతో హైదరాబాద్‌కు మ్యాచ్‌లు రావట్లేదన్నారు. ఇక్కడి మైదానం దేశంలోనే అత్యుత్తమమైనదని ఆయన అభివర్ణించారు.
అందుకే సమస్యలు
హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్ చెప్పింది ఒకలా.. జాన్ మనోజ్ చెప్పింది మరోలా ఉంది. అందుకే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. రిటైర్డ్ జడ్జితో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తే ఉన్న సమస్యలన్నీ దూరమయ్యే అవకాశం ఉంది. సభ్యులతో కూర్చొని సమస్యను పరిష్కరించుకుంటే కూడా హెచ్‌సీఏకు మేలు జరుగుతుంది. ఇదీ కుదరదు అనుకుంటే... మళ్లీ ఎన్నికలకు వెళ్లండి. ఆ తర్వాత కొత్త కార్యవర్గం 30 రోజుల్లో వస్తుంది. సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది.
-వినోద్ వెంకటస్వామి, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు
సోమవారం జింఖానా గ్రౌండ్లో జరిగిన ఘటన దురదృష్టకరమని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ ఆరోపించారు. పోలీసులు ఒకరికి కొమ్ము కాస్తున్నారన్నారు. ఇక అజార్ ఇటీవల కొత్తగా 6 జిల్లాలకు అఫిలికేషన్ ఇచ్చారని.. ఇది సరైంది కాదన్నారు. ఇందులో పారదర్శకత లేదన్నారు. లోధా ప్రకారం తాను పోటీ చేయలేనన్నారు. కానీ క్రికెట్ అభివృద్ధికి మాత్రం ఎప్పుడు ముందు ఉంటానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ICC Rankings: అగ్రస్థానంలో మిథాలీ, షెఫాలీ