Hardik Pandya Skips Ranji Trophy: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇచ్చిన సలహాను.. టీమ్‌ఇండియా ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్య పక్కన పెట్టాడు. వెన్నెముక గాయం కారణంగా భారత జట్టుకు దూరమైన హర్దిక్ పాండ్య.. తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు రంజీల్లో ఆడటం ఉత్తమమని సౌరవ్ గంగూలీ ఇటీవల సలహా ఇచ్చాడు. అయితే హార్దిక్.. రంజీ క్రికెట్లో పాల్గొనడం లేదని ఇటీవలే ప్రకటించాడు. దీంతో బరోడా జట్టుకు అతడి స్థానంలో కేదర్ దేవ్‌ధర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్య పునరాగమనం గురించి ప్రస్తావించాడు.
హార్దిక్ పాండ్య వెన్నెముక గాయం నుంచి కోలుకోవడానికి తగిన సమయం ఇచ్చాం. ప్రస్తుతం అతడు రంజీల్లో ఆడడం ఉత్తమం. అక్కడ వీలైనన్ని ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయాలి. అప్పుడే అతడి శరీరం దృఢంగా మారుతుంది. ఐపీఎల్‌లో అతడు అహ్మదాబాద్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సేవలందించడానికి అతడు ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది సెలక్టర్లు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటారు
-- సౌరవ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
గాయం కారణంగా చాలా కాలంగా హార్దిక్ భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కినా అంచనాలను అందుకోలేకపోయాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న అతడు.. టీమ్‌ఇండియాలోకి పునరాగమనంపై దృష్టి పెట్టాడు.
వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లోకి కొత్తగా అడుగుపెట్టనున్న అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరి 10 నుంచి రంజీ ట్రోఫీ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని.. విజేతలుగా ఎదిగి..