ఇంగ్లాండ్‌లో జరగబోయే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు ఐదు టెస్టుల సిరీస్‌కు హార్దిక్ పాండ్యను ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని మాజీ సెలెక్టర్ శరణ్‌దీప్ సింగ్ అభిప్రాయపడ్డారు. పాండ్య తన కోటా మేరకు బౌలింగ్ చేయకపోతే పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తుది జట్టులో సరిపోడని చెప్పారు. మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనకు పృథ్వీషాని విస్మరించడం ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు.
"రాబోయే టెస్టు మ్యాచ్‌లకు హార్దిక్‌ను పక్కనపెట్టడం అర్ధం చేసుకోగలను. అతడి సర్జరీ తర్వాత తన కోటా మేరకు బౌలింగ్ చేయలేకపోతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతడు తుది జట్టులో ఉండాలంటే వన్డేల్లో 10 ఓవర్లు, టీ20ల్లో నాలుగు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయాలి. కేవలం బ్యాట్స్‌మన్‌గా ఆడలేడు. అతడు బౌలింగ్ చేయకపోతే జట్టు కూర్పు సమన్వయం కోల్పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకో అదనపు బౌలర్‌ను పెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతో సూర్యకుమార్‌లాంటి బ్యాట్స్‌మన్ తప్పుకోవాల్సి వస్తుంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ల్లో ఇదే మనం చూశాం. ఇప్పుడు టీమ్‌ఇండియాలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జడేజా, శార్దూల్ ఠాకుర్ లాంటి ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఒకవేళ హార్దిక్ బౌలింగ్ చేయకపోతే వీళ్లంతా ఆ పని చేయగలరు" అని శరణ్‌దీప్ అన్నారు.
అనంతరం పృథ్వీషాపై స్పందిస్తూ టీమ్‌ఇండియాకు సెహ్వాగ్ ఏం చేశాడో అది చేసే సత్తా యువ బ్యాట్స్‌మన్‌లో ఉందన్నారు. "పృథ్వీ కెరీర్ తొలినాళ్లలోనే పక్కకు పెట్టడం సరికాదు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో అతడు వందలకొద్దీ పరుగులు చేశాడు. తన టెక్నికల్ తప్పులను కూడా సరిదిద్దుకున్నాడు. ఐపీఎల్‌లోనూ ఎలా ఆడాడో మనందరం చూశాం. పృథ్వీ, శుభ్‌మన్ లాంటి యువకులకు అండగా ఉండాలి. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపిక చేసిన ఆటగాళ్లలో అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్ కాగా, మిగతా ముగ్గురు అవేశ్‌ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్జాన్ నాగ్వాస్‌వల్లా బౌలర్లు. ప్రియాంక్ పంచల్ న్యూజిలాండ్‌లో ఇండియా ఏ తరఫున సెంచరీ బాదాడు. అతడిని తీసుకోలేదు. దేవ్‌దత్ పడిక్కల్‌ను కూడా ఎంపిక చేయలేదు. అలాగే జయదేవ్ ఉనద్కత్‌ని కూడా ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావడం లేదు" అని శరణ్‌దీప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'నా కెరీర్ రూపకల్పనలో అతడిదే ప్రధాన పాత్ర'