మన దేశంలో క్రికెట్ బాగోగులు చూసుకునే పదవుల్లో చీఫ్ సెలెక్టర్ పదవి ఒకటి. అయితే తాజాగా చీఫ్ సెలెక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా చేయగా ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే విషయంలో తలకిందులవుతోంది బీసీసీఐ. దీంతో మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ ఈ విషయంపై స్పందించాడు. చీఫ్ సెలెక్టర్‌కు కూడా కోచ్‌కు ఇచ్చినంత జీతం ఇస్తే.. ప్రముఖ క్రీడాకారుల్లో ఎవరైన సరే ఈ బాధ్యతను నిర్వర్తించేందుకు ఆసక్తి చూపుతారని ఆయన వ్యాఖ్యానించారు.
"చాలా కాలంగా క్రికెట్లో ఉన్న ప్లేయర్లు చీఫ్ సెలెక్టర్ లాంటి స్థాయిలో ఉంటే కచ్చితంగా చాలా సమస్యలు పరిష్కరించగలుగుతారు. కానీ వాళ్లెవరూ ఈ పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు వీరేంద్ర సెహ్వాగ్.. ఆయన్ను ఒక వేళ చీఫ్ సెలెక్టర్‌గా ఎంచుకుంటే ఆయనకు సరైన జీతం ఇవ్వాలి కదా. ఇండియాలోని చీఫ్ సెలెక్టర్లు ఎంత సంపాదిస్తారు నాకు తెలీదు. కానీ సెహ్వాగ్ కామెంటరీ చెప్తే, మరే ఇతర క్రికెట్ సంబంధిత వ్యాపారంలో ఉన్నాడంటే అతను ఎక్కువ సంపాదిస్తున్నట్లే కదా" అని హర్భజన్ సింగ్ అన్నాడు.
అంతే కాకుండా సెహ్వాగ్ లాంటి వారిని ఈ పదవికి తీసుకోవాలంటే కచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అని అన్నాడు. "డబ్బు ఖర్చు పెట్టకపోతే ఈ పదవి కోసం.. ఒకటి, రెండేళ్లు క్రికెట్ ఆడిన వాళ్లలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తుంది. వాళ్లు అంత పెద్ద ఆటగాళ్లు కాకపోవచ్చు. రాహుల్ ద్రవిడ్ స్థాయి వ్యక్తిని కోచ్‌గా పెట్టినప్పుడు అంత స్థాయి ఆటగాడినే చీఫ్ సెలెక్టర్‌గా కూడా పెట్టాలి కదా!" అని ప్రశ్నించాడు.
'టీమ్‌ఇండియాకు మరో కొత్త కోచ్ కావాల్సిందే'
2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్‌ను టీమ్ఇండియా ముద్దాడింది. అయితే మరోసారి ఆ టోర్నీలో ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. 2014లో అవకాశం వచ్చినప్పటికీ శ్రీలంక ముందు ఓడిన టీమ్ఇండియా ఆ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయింది. అయితే రెండేళ్ల క్రితం సెమీస్ వరకు చేరుకోని టీమ్ఇండియా 2022లో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యింది. ఈ నేపథ్యంలో రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా యాజమాన్యానికి మాజీ స్పిన్నర్ హర్భజన్ పలు సూచనలు చేశాడు. జట్టు పటిష్ఠంగా ఉండాలంటే టీ20లకు ఓ ప్రత్యేక కోచ్‌ను నియమించాలని అన్నాడు. అంతే కాకుండా మిగిలిన ఫార్మాట్ల బాధ్యతలను మరో కోచ్‌కు అప్పగించాలని తెలిపాడు.
"అవును, టీమ్‌ఇండియాకు ఇద్దరు కెప్టెన్‌లు ఉన్నారు. భిన్నంగా ఎందుకు ఆలోచించకూడదు. ఇంగ్లాండ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ను కోచ్‌గా నియమించుకుంది. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ లేదా ఆశిశ్ నెహ్రాతో ప్రయోగం చేయవచ్చు. నెహ్రా శిక్షణలో హార్దిక్ పాండ్య ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా పని చేసి విజయం సాధించాడు. కాబట్టి, టీ20 కాన్సెప్ట్‌ను, ఆ ఫార్మాట్ అవసరాలను గుర్తించే వారిని కోచ్‌గా నియమించండి. ప్రస్తుతం దృష్టంతా టీ20లపైనే ఉంది. పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టును ఛాంపియన్‌గా ఎలా తీర్చిదిద్దాలో నెహ్రాకు తెలుసు. టెస్టులు, వన్డేలలో టీమ్‌ఇండియాను అగ్రస్థానానికి చేర్చడానికి అవసరమైన ప్రణాళికలు ద్రవిడ్ వద్ద ఉన్నాయి" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
2024లో టీ20 ప్రపంచకప్ జరగనున్న వేళ.. బీసీసీఐ ఇప్పటి నుంచే యువ జట్టును తయారు చేయడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే సీనియర్లు అయిన రోహిత్, విరాట్ కోహ్లీలను టీ20లకు ఎంపిక చేయకుండా యంగ్ ప్లేయర్ హార్దిక్ పాండ్యకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తోంది.