Harbhajan Singh: మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా తనకొచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల చదువుల కోసం అందిస్తానని ప్రకటించారు. ఈ మేరకు భజ్జీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. "ఒక రాజ్యసభ సభ్యుడిగా.. రైతుల కుమార్తెల విద్య, సంక్షేమం కోసం నా వేతనాన్ని వారికి అందించాలని అనుకుంటున్నా. మన దేశ అభివృద్ధికి తోడ్పాడు అందించేందుకు నాకు చేతనైనంత చేస్తాను" అని హర్భజన్ ట్వీట్ చేశారు.
హర్భజన్ సింగ్ గత నెల పంజాబ్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో ఈ రాష్ట్రం నుంచి ఐదు స్థానాలు దక్కాయి. ఈ స్థానాల్లో హర్భజన్‌తో పాటు పార్టీ నేత రాఘవ్ చద్దా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిత్తల్, ఐఐటీ దిల్లీ ప్రొఫెషర్ సందీప్ పాఠక్, పారిశ్రామిక వేత్త సంజీవ్ అరోఢాను నామినేట్ చేసింది. గతేడాది డిసెంబరులో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
ఇదీ చూడండి: 'క్రెడిట్ మొత్తం ధోనీకేనా.. మిగతా ప్లేయర్స్ లస్సీ తాగేందుకు వెళ్లారా?'