Harbhajan Polititics: టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ శుక్రవారం ఆటకు వీడ్కోలు పలికాడు. దాదాపు 23 ఏళ్ల పాటు భారత జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. దిగ్గజ స్పిన్నర్‌గా పేరుగడించాడు. అయితే భజ్జీ రిటైర్మెంట్ అనంతరం అతడి సెకండ్ ఇన్నింగ్స్ గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి. కొందరు ఐపీఎల్లో సహాయ సిబ్బంది అవతారం ఎత్తబోతున్నాడని అంటుంటే.. మరికొందరు భజ్జీ రాజకీయాల్లోకి రాబోతున్నాడని చెబుతున్నారు. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు హర్భజన్.
"ప్రతి పార్టీలోని నాయకులు నాకు తెలుసు. ఏదైనా పార్టీలో చేరే ముందే నేను అందరికీ చెబుతా. పంజాబ్ రాష్ట్రానికి నా వంతు సేవ చేస్తా. అది రాజకీయాల ద్వారానా, లేక మరే మార్గం ద్వారానా అనేది ఇంకా నిశ్చయించుకోలేదు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటా."
-హర్భజన్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
అంతర్జాతీయ కెరీర్లో టీమ్ఇండియా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు హర్భజన్. ఇతడు మొత్తంగా 711 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 953 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ (687), రవి అశ్విన్ (638), జహీర్ ఖాన్ (597) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.