Under-19 World Cup 2022 : భారత్ అండర్-19 క్రికెట్ జట్టు ప్రపంచ విజేతగా నిలవడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. యువ భారత జట్టు ఈ విజయం సాధించడం వెనుక గుంటూరుకు చెందిన షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు. తమ కుమారుడు రషీద్ జట్టును గెలిపించడంతో తల్లిదండ్రులు జ్యోతి, బాలీషా, బంధువులు, స్నేహితులు స్వీట్లు పంచుకున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, వివిధ వర్గాలకు చెందినవారు రషీద్‌తో పాటు అతని తల్లిదండ్రులను అభినందించారు.
రోజుకు 8 గంటలు శిక్షణ
Under-19 Cricketer Shaik Rasheed : తన కుమారుడు రషీద్ గొప్పగా ఆడటం గర్వంగా ఉందని తండ్రి బాలీషా సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పేరును అనుమడింప జేశాడని.. ఆంధ్రప్రదేశ్ పేరును.. గుంటూరు పేరును ప్రపంచానికి చాటిచెప్పాడని రషీద్ తండ్రి బాలీషా సంతోషం వ్యక్తం చేశారు. రషీద్ రోజుకు 8 గంటలు శిక్షణ తీసుకునేవాడని, కష్టపడినందుకు ఫలితం దక్కిందన్నారు. మధ్య తరగతి కుటుంబం కావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామని, మంగళగిరి క్రికెట్ అకాడమీలో రషీద్‌కు చోటుదక్కాక.. చదువు, శిక్షణ బాగా సాగాయని బాలిషా చెప్పారు. చాలా మంది కోచ్‌లు రషీద్‌ను మెరుగుపర్చారని.. చాలా మంది స్నేహితులు తనను ఆదుకున్నారని రషీద్ తండ్రి కృతజ్ఞతలు చెప్పారు.
జాతీయ టెస్ట్ జట్టులో స్థానమే లక్ష్యం
Cricketer Shaik Rasheed : 'అండర్-19 క్రికెట్ కప్‌కు ఎంపికైనప్పుడే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చూపాలనే కృత నిశ్చయంతో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 31 పరుగులు చేసినప్పటికీ రషీద్ తాను అవుటైన తీరుకు తీవ్ర నిరాశ చెందాడు. ఆ మ్యాచ్‌లో జట్టు గెలిచింది. రెండోసారి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సమయంలో కొవిడ్ పాజిటివ్‌గా రావడంతో ఆడే అవకాశం కోల్పోయాడు. కానీ హోటలో ఉంటూ మాతో వీడియోకాల్ మాట్లాడేవాడు. మేము కొద్దిగా ఆందోళన చెందాం. కానీ రషీదే మాకు ధైర్యం చెప్పాడు. క్వార్టర్ ఫైనల్‌లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో జట్టుకు సునాయస విజయం దక్కింది. ఇందులో రషీద్ 26 పరుగులు చేశాడు. సెమీఫైనల్స్‌లో 94 పరుగులతో రషీద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫైనల్ పోటీలో జట్టు రెండో బంతికే ఓపెనర్‌ను కోల్పోవడంతో బరికిలోకి దిగిన రషీద్ మొదట్లో రక్షణాత్మకంగా ఆడిన నిలదొక్కుకున్న తర్వాత షాట్లు ఆడినతీరు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జాతీయ టెస్ట్ జట్టులో స్థానమే రషీద్ తరువాతి లక్ష్యం.'
- జ్యోతి, బాలీషా, రషీద్ తల్లిదండ్రులు
అవసరమైన సహకారాన్ని అందిస్తా
'పట్టుదలతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇండియా అండర్-19 క్రికెట్ టీం వైస్‌కెప్టెన్ షేక్ రషీద్ యువతకు ఆదర్శమని చెప్పాలి. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్‌లో క్లిష్ట పరిస్థితుల్లో చక్కగా పరుగులు సాధించిన రషీద్ జట్టుకు మంచి విజయాన్ని అందించాడు. రషీద్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎదిగేందుకు అవసరమైన సహాయ, సహకారాలను విజ్ఞాన్ విద్యాసంస్థల నుంచి అందిస్తాం. ప్రస్తుతం నరసరావుపేటలో ఇంటర్ చదువుతున్న రషీద్‌ను ఇక్కడికి చేరుకున్నాక ఘనంగా సన్మానిస్తాం.'
- లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీ
యువతకు ఆదర్శం
'అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత జట్టు గెలుపొందడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ విజయంలో వైస్ కెప్టెన్ షేక్ రషీద్ కీలక పాత్ర పోషించాడు. సెమీఫైనల్స్‌లో 94 పరుగులు, ఫైనల్స్‌లో హాఫ్ సెంచరీ చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. రషీద్ తండ్రి బాలీషా తన కుమారుడు కోసం ఎంతో కష్టపడ్డారు. ఆంధ్రా క్రికెట్ అకాడమీలో శిక్షణ ఇప్పించాం. రషీద్ ఇక్కడకు రాగానే ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.'
- గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే