వన్డే క్రికెట్లో లక్ష్యాలను ఎలా ఛేదించాలో మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్(Greg Chappell) నేర్పించారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా(Suresh Raina) అన్నాడు. ఆటగాళ్లతో బృందచర్చల్లో నిరంతరం బ్యాటింగ్, భాగస్వామ్యాల ప్రాముఖ్యం వివరించేవారని పేర్కొన్నాడు. విజయాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారన్నాడు. తన ఆత్మకథ 'బిలీవ్'(Raina Believe)లో ఈ వివరాలను రైనా పొందుపరిచాడు.
"గ్రెగ్ ఛాపెల్ కోచింగ్ కెరీర్ వివాదాల మయం కావొచ్చు. కానీ విజయాలు ఎలా సాధించాలో టీమ్‌ఇండియాకు అతడు నేర్పించాడు. విజయం ప్రాముఖ్యాన్ని బోధించాడు. నిజానికి మేమంతా అప్పుడు బాగా ఆడుతున్నాం. లక్ష్య ఛేదనల్లో బ్యాటింగ్, భాగస్వామ్యాల గురించి అతడు నొక్కి చెప్పడం నాకు గుర్తుంది."
- సురేశ్ రైనా, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
భారత క్రికెట్లో గ్రెగ్ ఛాపెల్, సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) విభేదాల గురించి అందరికీ తెలుసు. అయితే ఛాపెల్ కోచింగ్‌లోనే సురేశ్ రైనా అరంగేట్రం చేశాడు. దంబుల్లాలో శ్రీలంకతో తొలి వన్డే ఆడాడు. ఆ పోరులో విఫలమైనా కెరీర్లో 226 వన్డేలు ఆడటం విశేషం. 35.31 సగటుతో 5,615 పరుగులు సాధించాడు. తన స్పిన్ బౌలింగ్‌తో 36 వికెట్లు పొడగొట్టాడు.
ఛాపెల్ కోచింగ్‌లో 2005, సెప్టెంబర్ 2 నుంచి 2006, మే 18 వరకు భారత్ వరుసగా 17 వన్డేల్లో లక్ష్యాలను ఛేదించడం ప్రత్యేకం. వీటికి రాహుల్ ద్రవిడ్(Dravid) సారథ్యం వహించాడు.
ఇదీ చూడండి.. WTC final: మరో వారం రోజులే సమయం!