తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులకు ఇక పండగే. హైదరాబాద్ విశాఖపట్నం వేదికలుగా త్వరలో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. గతేడాది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగ్గా.. రెండింటిలోనూ భారత్ జయకేతనం ఎగరేసింది. ఇప్పుడు మరోసారి మన దగ్గర అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే మ్యాచ్ హైదరాబాద్‌లోనే జరగనుంది. ఈ నెల 18న ఉప్పల్ మైదానంలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. దీనికిగాను ఇప్పటికే రెండు జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లు ముగిసిన అనంతరం టీమ్‌ఇండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు (బోర్డర్ గావస్కర్ సిరీస్) ఆడనుంది. అనంతరం మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్‌లోని రెండో వన్డేకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 19న ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.
గతేడాది భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు టీ20ల సిరీస్ జరగ్గా.. మూడో టీ20కి విశాఖ ఆతిథ్యం ఇచ్చింది. అప్పటికే ఈ సిరీస్‌లో భారత్ వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడిన సమయంలో విశాఖలో విజయ గర్జన చేసింది. 48 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి సత్తా చాటింది. ఇక ఇంకో మ్యాచ్ విషయానికొస్తే.. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య గతేడాది సెప్టెంబర్ 25న మూడో టీ20 మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరి ఈ కొత్త ఏడాదిలో ఏమవుతుందో చూడాలి.